తప్పెవరిది...శిక్ష ఎవరికి..!?

తప్పెవరిది...శిక్ష ఎవరికి..!?

ఒకటి..ఒకటి..ఒకటి..ఒకటి…రెండు..రెండు..మూడు..మూడు..మూడూ..! ఇవి ఫలితాలు రాగానే సాయంత్రం పూట టీవీలో వచ్చే ఘరానా ప్రైవేటు కాలేజీల ర్యాంకులు కావు. ఘనత వహించిన ఇంటర్ బోర్డు మూల్యాంకనం వల్ల ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు వచ్చిన మార్కులు. విచిత్రమేంటంటే ఈ నంబర్లతో పాటు సున్నా మార్కులు వచ్చాయని కూడా మార్కుల జాబితాలు ఇవ్వడం ప్రపంచంలో మరెక్కడా జరగదేమో.

మొదట ఈ ఫలితాల వెనుక ఉన్న మతలబేంటో చూద్దాం..! పరీక్షల నిర్వహణను గ్లోబరీనా అనే వివాదాస్పద సంస్థకు అప్పగించింది ఇంటర్ బోర్డ్… కాకినాడలోని జేఎన్‌టీయూ విద్యార్థులకు బోధన, పరీక్ష విధానంలో వేగవంతమైన ఆన్‌లైన్‌ సేవలు అందించే ఉద్దేశంతో.. 2013లో అప్పటి వైస్‌ఛాన్సలర్ హైదరాబాద్‌కు చెందిన గ్లోబరీనా టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, ఈ- కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, పరీక్షా పత్రాలు ఆన్‌లైన్‌లో దిద్దడం, ఈ-లాస్‌ వంటి అంశాలను అభివృద్ధి చేసి అందించడం దీని పని. అయితే… స్టాండర్డ్‌ కమిటీ మార్గదర్శకాల ప్రకారం సేవలు లేవని.. సేవల్లో నాణ్యత లేదనే కారణాల వల్ల ఈ సంస్థ వల్ల యూనివర్శిటీకి దాదాపు రూ. 27 కోట్లు నష్టం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటి రిజిస్ట్రార్ వి.వి. సుబ్బారావు. ఇదన్నమాట అధ్యాయానికి, అధ్యయనానికి తేడా తెలీని సంస్థ గ్లోబరీనా బాగోతం. ఆన్‌లైన్ బోధన వ్యవహారాలు, పరీక్షా నిర్వహణ పేరుతో ఈ సంస్థ ఇదివరకు కాకినాడ వర్శిటీని మోసం చేసి ఉంది. ఇపుడు భవిష్యత్తుపై ఎంతో నమ్మకంతో గంటల తరబడి నిద్రమానుకుని మరీ చదివే ఇంటర్ విద్యార్థుల, వారి తల్లిదండ్రుల జీవితాలపై వేటు వేసింది. పిల్లల్లో ఐటీ స్కిల్స్‌ని పెంచే బోడి సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని ఇంటర్‌బోర్డు అప్పనంగా వారి చేతిలో పెట్టేసింది. పైగా ఆ సంస్థకు కోట్లలో చెల్లింపులు చేయడం… త్రికోణమితికి, మాత్రికలకు తేడా తెలీని ఈ సంస్థ మార్కులు వేయడంతో వేలమంది విద్యార్థులు మానసికంగా కృంగిపోయారు.

ఇంత పెద్ద వ్యవహారం బయటపడితే విద్యాశాఖ మంత్రి మాత్రం అవకతవకలు లేవని కేవలం అపోహలు మాత్రమేనంటూ సూర్యాపేటలో మాట్లాడి తప్పుకున్నారు. ఇది సరే.. ఫలితాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి తమకు సమాధానం చెప్పమని ఇంటర్ బోర్డు దగ్గరకు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులను కలిసే నాథుడు లేడు. పైగా ఇంటర్ బోర్డు ముందు పోలీసుల కాపలాతో బాధితులపై దాడి చేసి అదుపులోకి తీసుకుంటున్నారు… మహిళలని కూడా చూడకుండా పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారు. వారేమో వచ్చిన వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఆ ప్రాంతంలో నిలబడితే అరెస్ట్ చేస్తాం, స్టేషన్‌కు తరలిస్తాం అనేలా వ్యవహరించడం. 22న సోమవారం మధ్యాహ్నం ఎండలో…బోర్డు అధికారులపై నిరసన వ్యక్తం చేస్తున్న ఓ విద్యార్థినిని బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి తీసుకెళ్లారు పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్లారు అని మీడియా ప్రశ్నిస్తే ‘ఎవరు తీసుకెళ్లారు?’ అని ఎదురు ప్రశ్నించారు పోలీస్ అధికారులు

బోర్డుకి, ఈ ఫలితాల విషయంలో మాత్రమే కష్టాలు రాలేదు. హాల్‌టికెట్‌లు, ఫీజుల చెల్లింపులు చేయడం కూడా గ్లోబరీనా సంస్థకు తెలీదు. రివాల్యుయేషన్ వెబ్‌సైట్ ఓపెన్ అవదు, ఎప్పటికపుడు ఫీజు చెల్లింపు గడువు తేదీని పెంచుకుంటూ వెళ్లారు. డేటా ప్రాసెసింగ్ పనీ తెలీదు, దానికి సరిపడా సాఫ్ట్‌వేర్ కూడా వారి దగ్గర లేదని సమాచారం. ఈ అవగాహనాలోపంతో తప్పులు తప్పులుగా గందరగోళం చేసేసింది. అయితే… జరిగిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నంలో ఏదేదో మాట్లాడి, సమస్యను పూర్తీగా పక్కదోవ పట్టిస్తున్నారు. పైగా ఏపీ, ఏఎఫ్ అనే వింతపదాలను మంత్రాల్లా పదే పదే చెప్పారు బోర్డ్ కార్యదర్శి అశోక్. ఇది అత్యంత బాధ్యతారాహిత్యంగా చేస్తున్న పని. అక్కడితో ఆగకుండా బబ్లింగ్ వల్ల ఇలా జరిగిందని కొత్త వాదనను ముందుకు తెచ్చారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌తో అంతా సరిదిద్దుకోవచ్చని ఆయన తప్పుల్ని కప్పిపుచ్చుతున్నారు. ఇంకా…బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, టెక్నికల్ తప్పుల్ని తేల్చుతాం’ అని ఒక మాట మైకుల ముందు విసిరేసి వెళ్లిపోతున్నారు అధికారులు.

ఇపుడు ఇంటర్ బోర్డు ముందు సవాలక్ష ప్రశ్నలున్నాయి… అయ్యా!వాల్యుయేషన్‌ అనామకులతో చేయించారు.. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌లు ఎలా చేస్తారు? ఈ తతంగమంతా ముగిసేలోపు సప్లిమెంటరీ గడువు వచ్చేస్తుంది. అదెలా? ఇతర ఎంట్రెన్స్ టెస్టులు, ప్రవేశాలు వచ్చేస్తాయి.. అవెలా? అయితే.. గ్రేస్ మార్కులేస్తారా? మళ్లీ పరీక్షలు పెడతారా? అదెలాగూ జరిగేపని కాదు…బాల్యానికి, భవిష్యత్తుకి మధ్యలో ఆగిన పిల్లలకు సమాధానం ఎవరు చెబుతారు? ఇన్ని ప్రశ్నలు మెడకు చుట్టుకుని ఇంటర్‌బోర్డు… విద్యార్థులను ఒత్తిళ్ల మధ్య ఇరికించే ప్రైవేటు కాలేజీలు ఉరేసుకోగలవా? పూర్తిగా ఇంటర్ బోర్డు ఎత్తేసి… ఎస్ఎస్‌సీ బోర్డులో కలిపేసి ఇకనైనా విద్యార్థుల్లో ఆశలు సజీవం చేయగలరా? మళ్లీ ప్రశ్న దగ్గరే ఆగిపోదాం. సమాధానంలేని స్థలంలో…!!?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *