స్వామి మీరే దిక్కు ..! చిన్నజీయర్ కాళ్లపై పడ్డ తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు

స్వామి మీరే దిక్కు ..! చిన్నజీయర్ కాళ్లపై పడ్డ తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు

రెవిన్యూ శాఖను రద్దు చేసే ఆలోచనలో ఉన్న కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఎంత పోరాడినా ఎలాంటి ఫలితమూ కనిపించడం లేదు.నిరసనలూ,ధర్నాలూ,సామూహిక ప్రకటనలూ సీఎం చెవులకు వినబడలేదు.ఎలా అయినా సరే…రెవిన్యూ శాఖను కాపాడుకోవాలని ఆ ఉద్యోగులు కొత్త దారిని ఎంచుకున్నారు.రికమండేషన్ మంత్రాన్ని జపిస్తున్నారు.ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వోద్యోగులూ తమ హక్కులను సాధించుకునేందుకు నడవని దారిలో వీళ్ళు నడుస్తున్నారు.ఆ దారేంటో,ఆ రికమండేషన్ మంత్రమేంటో ఫోకస్ చేద్దాం పదండి.

అలా చేశారు…
ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.అవన్నీ కాదని చివరికి ఓ నిర్ణయానికొచ్చారు.అనుకున్నదే తడవుగా…రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్ కొంతమంది సభ్యులతో కలిసి నేరుగా చిన్న జీయర్ స్వామి వద్దకు చేరుకున్నారు.తమ గోడును వెళ్లబోసుకుని,కేసీఆర్ వరకూ చేరవేసి తమకు సాయం చేయాల్సిందిగా కోరారు.

అలా అడిగారు…

హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో ఉన్న చిన్న జీయర్ స్వామిని ఈ సభ్యులు కలిశారు.రెవిన్యూ శాఖను ఎలా అయినా కాపాడాలనీ,రద్దు చేయాలనుకుంటున్న నిర్ణయంపై మనసు మార్చుకునేలా కేసీఆర్‌తో మాట్లాడాలనీ,డోలాయమానంలో ఉన్న తమ పరిస్థితిని చక్కదిద్దాలనీ…చినజీయర్ స్వామిని వేడుకున్నారు.రెవిన్యూ శాఖ ఇప్పుడిప్పుడు పుట్టింది కాదనీ,దీనికి రెండు శతాబ్దాలపైన చరిత్ర ఉందనీ…తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకునే విధంగా సీఎంకు నచ్చజెప్పమనీ కోరారు.

ఇదేమి చిత్రం…

ఎవరూ ఊహించని ఈ సభ్యుల అడుగుకు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.ఇదేమి చిత్రమంటూ కొందరు నవ్వుకుంటున్నారు.కేసీఆర్ మనస్తత్వం లోతుగా తెల్సిన వాళ్ళు మాత్రం ఇది తెలివైన పనే అంటున్నారు.

సాధారణంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు…సంబంధిత శాఖ సెక్రటరీ వద్దకో,చీఫ్ సెక్రటరీ వద్దకో,సంబంధిత కేబినెట్ మంత్రి వద్దకో వెళ్లి తమ సమస్యలను చెప్పుకుంటారు.కానీ తెలంగాణా ప్రభుత్వోద్యోగులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలూ ఎదురవుతున్నాయి.ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వామీజీల అడుగులకు మడుగులద్దే కేసీఆర్ లాంటి నాయకులు ఉంటే…ఉద్యోగులకు ఇలాంటి దారులే మిగులుతాయని ఎంతోమంది బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *