500 కోట్లతో తెలంగాణలో కొత్త సచివాలయం: సీఎం కేసీఆర్

500 కోట్లతో తెలంగాణలో కొత్త సచివాలయం: సీఎం కేసీఆర్

తెలంగాణలో సరికొత్త సచివాలయాన్నీ, శాసనసభ మందిరాన్నీ, పార్లమెంటులో ఉన్నట్లుగా సెంట్రల్ హాలునూ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ మూడు నిర్మాణాలకు 500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఎర్రమంజిల్ కాలనీలో ఈ భవనాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకూ ఉన్న శాసనసభ, శాసనమండలి భవనాలను చారిత్రక చిహ్నాలుగా చేస్తామని, వాటిని పడగొట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టమని ప్రకటించారు. తెలంగాణ సచివాలయం, శాసనసభ, శాసనమండలి మందిరాలు, సెంట్రల్ హాలు ఒకే ప్రాంగణంలో నిర్మిస్తామని, ఇవి ఐదు నుంచి ఆరు లక్షల ఎస్ ఎఫ్ టీలో సువిశాలంగా ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.

పొరుగు రాష్ట్రాలతో స్నేహం ఉండాలి!

సచివాలయం నిర్మాణానికి నాలుగు వందల కోట్ల రూపాయలు, శాసనసభ, శాసన మండలి నిర్మాణాలకు వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని, తెలంగాణలో ప్రతి ఎకరాకు నీరు అందేలా చేస్తామని ఆయన అన్నారు. ఈ నెల 21వ తేదీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవిస్ కూడా పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక ప్రాజెక్ట్ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకూడదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఇది వారి తెలివి తక్కువతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. “తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సోయి లేదు. మెదడు లేదు. కాంగ్రెస్ నాయకులు పాజిటివ్ గా ఆలోచించనంత వరకు వారి స్థితి ఇలాగే ఉంటుంది” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా మెలిగితే తెలంగాణకే మేలు జరుగుతుందన్న ఇంగితం కూడా కాంగ్రెస్ నాయకులకు లేకపోవడం బాధాకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగానే మెలగాలని, నీళ్ళతో సహా ఇతర అంశాలను ఒకరికి ఒకరు పంచుకోవాలని తెలంగాణ క్యాబినెట్ అభిప్రాయపడినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *