కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ

కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ఐదో దశ కూడా పూర్తి కావడంతో మరోసారి కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో సమావేశమై ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు లక్ష్యం, ఆవశ్యకతను వివరించారు. తమతో కలిసి నడవాలంటూ కోరారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలతో పాటు లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీలు నిర్వహించాల్సిన పాత్రతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించారు. సుమారు గంటన్నరపాటు అనేక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు సంతోష్ కుమార్, వినోద్ కుమార్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

విజయన్‌తో భేటీకి ముందు కేసీఆర్ కుటుంబ సమేతంగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్‌కు తెలుగు సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ్నుంచి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు చేశారు. కాగా వారం రోజుల పాటు కేరళ సహా తమిళనాడులోనూ కేసీఆర్ పర్యటించనున్నారు. ఈనెల 8న కన్యకాపరమేశ్వరి ఆలయం, 9న రామేశ్వరం, 10న మధుర మీనాక్షి ఆలయం, 11 న శ్రీరంగం దేవాలయం సందర్శించనున్నారు.

ఇదిలా ఉంటే కేసీఆర్ కేరళ టూర్ వెనుక మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం జాతీయస్థాయిలోని నేతల్లో ఉంది. ఈ అపవాదును తొలగించుకోవడం కోసమే లెఫ్ట్ పార్టీలకు చెందిన సీఎంతో చర్చలు జరపడం ద్వారా బీజేపీకి తాము దూరమనే సంకేతాలను ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *