తృతీయం కాకపోతే కింకర్తవ్యం..! కేసీఆర్ ఆలోచన

తృతీయం కాకపోతే కింకర్తవ్యం..! కేసీఆర్ ఆలోచన

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తృతీయ కూటమి ఏర్పాట్లలో కేసీఆర్‌ తలమునకలయ్యాడు. ఏ పార్టీలతో కలవాలి… ఏ నాయకులతో జట్టు కట్టాలి… వంటి అంశాలపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాలలో తాను చక్రం తిప్పాలన్నది చాలా కాలంగా కేసీఆర్‌ మదిలో తొలుస్తున్న అంశం. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన కర్ణాటక, తమిళనాడు, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో అంతరంగిక చర్చలూ జరిపారు. ఈనెల 23వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తృతీయ ఫ్రంట్ వ్యూహానికి పదును పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడూ ఇదే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ వివిధ దశల్లో జరిగిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కేసీఆర్‌ తృతీయ ఫ్రంట్‌కు అవకాశం రాకపోతే జాతీయస్థాయిలో బీజేపీతో నడవాలా…? కాంగ్రెస్ పార్టీతో చేయి కలపాలా..? అన్న అంశంపై పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు… కేసీఆర్‌తో పోటీ పడుతున్నాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నాయకులు తనతో కలిసి వస్తారా…? లేక చంద్రబాబునాయుడితో వెళతారా అనే మీమాంస కేసీఆర్‌లో ఉంది. ఇతర రాష్ట్రాల వారితో కలిసి చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పితే తనను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నాడు. అది జరగకుండా ఉండాలంటే.. తనది పైచేయి కావాలంటే భారతీయ జనతా పార్టీతో కానీ, కాంగ్రెస్ పార్టీతో కానీ కలవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో కేసీఆర్ టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తృతీయ ఫ్రంట్ అయినా ఆ ప్రభుత్వంపై తన ముద్ర పడాలి అనేది కల్వకుంట్ల వారి వ్యూహంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకుండా చేయడం తాను ఆయనకు ఇచ్చే ఒక గిఫ్ట్ అయితే… కేంద్రంలో చంద్రబాబు ప్రాభవాన్ని తగ్గించడం మరో గిఫ్ట్ గా కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *