రాజానగరంలో రాజెవరు?

రాజానగరంలో రాజెవరు?

రాజానగరం రాజెవరు? మరోసారి సైకిల్ పరుగులు పెడుతుందా? లేక ఫ్యాన్ గాలి వీస్తుందా? ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? పోలింగ్ అంచనాలు ఏం చెబుతున్నాయి? జనసేన ప్రభావం ఏ పార్టీపై పడనుంది. చీలిన ఓట్లు ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఈసారి త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ…ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే కొనసాగింది. ఈ పోరులో విజయం తమదంటే తమదేనంటూ ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా…రాజానగరంలో ఎగిరే జెండా ఎవరిదనేది చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. గత రెండు ఎన్నికలకి భిన్నంగా ఈసారి రాజానగరం ఎన్నికలు జరిగినట్లు తెలుస్తోంది. రాజానగరం టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి పెందుర్తి వెంకటేశ్ పోటీ చేయగా, వైసీపీ నుంచి జక్కంపూడి రాజా బరిలో నిలిచారు. ఇక్కడ 2లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలం అనేది ఆసక్తికరంగా మారింది.

వరుసగా 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన పెందుర్తి వెంకటేష్, ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో విజయలక్ష్మిపై గెలిచిన పెందుర్తి, ఈసారి ఆమె తనయుడితో పోటీ పడ్డారు. అయితే గతంలో మాదిరిగా ఈసారి పెందుర్తి విజయం అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలే వెంకటేశ్ అవినీతి గురించి చంద్రబాబుకి ఫిర్యాదు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఇవి ఆయన విజయానికి అడ్డుగా మారినట్లు చెబుతున్నారు. అవినీతి ఆరోపణలున్నప్పటికీ, గత ఐదేళ్లలో వెంకటేశ్ అభివృద్ధి బాగానే చేశారన్న పేరు ఉంది. దీనికి తోడు కేడర్ బలంగా ఉండటం..సంక్షేమ పథకాలు ప్లస్ అవుతాయని పెందుర్తి వెంకటేశ్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసొస్తుందని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు. అదేవిధంగా జగన్ పాదయాత్ర, జక్కంపూడి కుటుంబానికి ఉన్న పేరు తనను గెలిపిస్తుందని రాజా ధీమాతో ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాలు ఉన్నాయి. ఇక్కడ కాపు, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి కాపు ఓటర్లదే. మొత్తం మీద వైసీపీకి సానుకూల వాతావరణం ఉన్నా…రాజానగరంలో జనసేన అభ్యర్ధి రాయపురెడ్డి ప్రసాద్ పోటీలో ఉండటం ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందంటున్నారు. జనసేన అభ్యర్థి కేవలం పవన్ ఇమేజ్, కాపు సామాజికవర్గం ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. జనసేన ప్రభావం ఏ పార్టీపై ఎఫెక్ట్ చూపనుంది.? రాజానగరంలో ఓటర్లు ఎవరికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టనున్నారో మరికొద్దిరోజుల్లో తేలిపోతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *