వార‌సుల ఓట‌మి!

వార‌సుల ఓట‌మి!

ఏపీలో వైసీపీ జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీలో టీడీపీ దిగ్గజ‌నాయ‌కుల వార‌సులు ఓట‌మి బాట‌ప‌డ్డారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ టెకెట్‌పై పోటీ చేసిన అతిర‌థ‌మ‌హార‌థుల త‌ప‌యులు ఓట‌మి అంచున వేలాడారు. . ముఖ్యంగా సానుభూతి ప‌వ‌నాలు జోరందుకుంటాయ‌ని, గెలుపు ఖాయ‌మ‌ని అనుకున్న చోట కూడా ప్రజ‌లు వైసీపీనే ఆద‌రించారు.

ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేసి ప్రజల ఆదరణ పొందలేకపోయారు. గతంలో మంత్రి బాధ్యతలు చేపట్టి ఆతరువాత ఎమ్మెల్సీ అయ్యారు. లోకేష్‌ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని సత్తా చాటాలనుకున్న లోకేష్‌కు పరాభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త గాలి ముద్దుకృష్ణమ త‌న‌యుడు గాలి భానుప్రకాశ్ రెడ్డి గెలిచి తీర‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, తాజా ఫ‌లితాల్లో ఆయ‌న గట్టిగా పోటీ ఇచ్చినా ఓడిపోయారు.

ఇక‌, వార‌సులు ఎక్కువ‌గా రంగంలోకి దిగిన అనంత‌పురంలోనూ ఇదే ప‌రిస్థితి ఏర్పడింది. దాదాపు మూడున్నర ద‌శాబ్దాలుగా ఇక్కడి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్కం తిప్పిన జేసీ దివాక‌ర్ రెడ్డి, ప్రభాక‌ర్ రెడ్డిల హ‌వాకు తాజా ఎన్నిక‌లు అడ్డుక‌ట్ట వేశాయి. ఇక్కడ నుంచి ప్రభాక‌ర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాజా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అనుకున్నా.. తాజా ఫ‌లితాల్లో చ‌తికిల ప‌డ్డారు. ఇక‌, అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి బ‌రిలో నిలిచిన దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్ కుమార్ రెడ్డి కూడా ఓట‌మిని చవి చూశారు. అదే విధంగా ఇదే జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ డే నుంచి చాక‌చ‌క్యంగా ప్రచారం చేసిన ప‌రిటాల సునీత కుమారుడు శ్రీ‌రాం ఓట‌మి అంచుల్లో వేలాడారు. క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన డిఫ్యూటీ సీఎం త‌న‌యుడు కేఈ శ్యాంబాబు కూడా ప‌రాజ‌యాన్ని చవి చూశారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కీలక పాత్ర పోషించిన టీజీ వెంకటేష్‌ తన కుమారుడు టీజీ భరత్‌ను కర్నూలు నుంచిరంగంలోకి దింపారు. విస్తృతంగా ప్రచారం చేసిన జగన్‌ సునామిలో కొట్టుకుపోయారు.

దేవినేని నెహ్రూ కృష్ణాజిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఎన్టీఆర్‌ హయాం నుంచి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు అవినాష్‌ టీడీపీ అనుబంధ సంస్థల్లో పనిచేసి గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నేత కొడాలి నాని చేతిలో ఓటమిని చవి చూశారు. మరో ముఖ్య నేత జలీల్‌ ఖాన్‌ కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా ఉన్నారు.ఇప్పుడు ఆయన కుమార్తె షబానా విజయవాడ వెస్ట్‌ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.

మంత్రి మృణాళిని కుమారుడు నాగార్జున చీపురుపల్లినుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి రంగంలోకి దిగిన‌.. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియ‌ర్ నేత పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె అదితి గ‌జ‌ప‌తిరాజు కూడా ఓడిపోయారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు. తనకు ఎదురు లేదనుకున్న సుధీర్‌ కుమార్‌ రెడ్డిని ప్రజలు ఓడించారు. గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ కుమార్తె శిరీష పలాస నుంచి బరిలో నిలిచింది. ఇక్కడ గౌతు కుటుంబానికి మంచి పేరుంది. తాజాగా రాష్ట్రంలో వైసీపీ పవనాలు వీయడంతో శిరీషను ఓడించారు. ఇలా మొత్తంగా వార‌సుల‌ను రంగంలోకి దింపిన టీడీపీ హేమా హేమీలు ఓట‌మిని చూసి జీర్ణించుకోలేని ప‌రిస్థితి నెల‌కొన‌డం గమ‌నార్హం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *