బోత్సను ఓడిస్తానంటున్న యువనేత!

బోత్సను ఓడిస్తానంటున్న యువనేత!

వచ్చే ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లస్ఖ్యంగా పెట్టుకున్నారు. ఆ విధంగా అభ్యర్థుల ఎంపికను కూడా చేపట్టారు.   ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు 126 మంది పేర్లతో తొలి జాబితాను వెల్లడించారు. ఇందులో సీనియర్ నాయకుల వారసులతో పాటు 83 మంది సిట్టింగ్ అభ్యర్థులకు అవకాశం దక్కింది. కీలకమైన స్థానాల్లో యువకులకు సీట్లు కేటాయించారు. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి యువనేతను రంగంలోకి దింపి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. తన కంచుకోట చీపురపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బొత్స ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని దాదాపు 23 వేల ఓట్లతో విజయాన్ని దక్కించుకున్నారు. ఆమెకు మంత్రివర్గంలోనూ చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని, తన స్థానంలో కుమారుడికి సీటు కేటాయించాలంటూ చంద్రబాబును మృణాళిని కోరారు.

దీంతో ఆమె అభ్యర్థన మేరకు చీపురపల్లి అభ్యర్థిగా ఆమె కుమారుడు కిమిడి నాగార్జునను ప్రకటించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. అదే 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ హయాంలో బొత్స సత్యన్నారాయణ కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అయితే, చీపురపల్లిలో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీచేసి బొత్స రెండో స్థానంలో నిలిచారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే ఆయన మరోసారి పోటీచేయబోతున్నారు.

అయితే.. కొత్తగా రాజకీయంలోకి వస్తున్న యువకుడు నాగార్జున ఏమేరకు బొత్సను నిలువరిస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. కానీ, కుటుంబ నేపథ్యం ఆయనకు కలిసివస్తుందని కొందరు భావిస్తున్నారు. పెదనాన్న, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆశీస్సులతో, మృణాళిని క్లీన్ ఇమేజ్ కూడా నాగార్జున గెలుపునకు దోహదం చేస్తాయనేది టీడీపీ వర్గాల నమ్మకం. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో స్వదేశానికి వచ్చారు. ఏడాది కాలంగా చీపురపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను, ప్రజలను దగ్గరగా కలుసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి నమ్మకమైన ఓటు బ్యాంకుతోపాటు, కరుడుగట్టిన కార్యకర్తలు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. కాబట్టి వారి అండదండలు నాగార్జునకు పుష్కలంగా లభిస్తాయనడంలో సందేహం లేదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *