స్విట్జర్లాండ్‌లో కూలిన మరో విమానం

స్విట్జర్లాండ్‌లో కూలిన మరో విమానం

అధికారికంగా ప్రకటించిన జేయూ ఎయిర్‌ లైన్స్

స్విట్జర్లాండ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 22 మంది మరణించారు. జేయూ 52 విమానం కూలిపోయినట్టు లోకల్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ జేయూ ఎయిర్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా చనిపోయినట్టు ఈ సంస్థ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో తెలిపింది. విమానంలో 19 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు పైలట్లు ఉన్నారు. స్విట్జర్లాండ్‌ లోని కాంటన్‌ ఆఫ్‌ గ్రాబుయెన్‌డెన్‌ దగ్గర పిజ్‌ సిగ్నాన్‌ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. ప్రమాదం గురించిన సమాచారం అందగానే లోకల్‌ పోలీసులు ఐదు హెలికాప్టర్లు, రక్షణ దళాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రమాద స్థలం సముద్ర మట్టానికి 8 వేల అడుగుల ఎత్తులో ఉంది. దాంతో మృతదేహాలను వెతకడం, సహాయక చర్యలు చేపట్టడం కష్టమవుతోందని లోకల్‌ మీడియా పేర్కొంది. ఇదే ప్రాంతంలో ఇంతకు ముందే మరో విమానం ప్రమాదానికి గురైంది. హెర్గిస్విల్‌ దగ్గర అడవిలో శనివారం జరిగిన ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని చెబుతున్నారు. విమానం మంటల్లో చిక్కుకోవడంతో …ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలీడం లేదని పోలీసులు తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

రెండు రోజుల్లో రెండు వరస విమాన ప్రమాదాలు

స్విస్‌లో ఒక రోజు తేడాతో ఒకే ప్రాంతంలో వరసగా రెండు విమాన ప్రమాదాలు జరగడంతో ఆ రూట్‌లో వెళ్లే విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. ఆ ప్రాంతంలోనే విమాన ప్రమాదాలు జరగడానికి కారణాల్ని విశ్లేషిస్తున్నామని అధికారులు చెప్పారు. స్విట్జర్లాండ్‌లో వరసగా రెండు విమానాలు కూలిపోవడానికి ముందు రోజు అంటే ఈ నెల 4వ తేదీ రష్యాకు చెందిన ఎంఐ -8 హెలికాప్టర్‌ మంటలకు ఆహుతైంది. సైబీరియాలోని ఇగర్కా పట్టణానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రాస్నో యార్సిక్‌ ప్రాంతంలో ఈ హెలికాప్టర్‌ మంటల్లో చిక్కుకుని కూలిపోయింది. ఇందులో ఉన్న ముగ్గురు సిబ్బంది, 15 మంది ప్రయాణికులు మరణించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *