కానిస్టేబుల్ మృతి పై పెరుగుతున్న అనుమానాలు

కానిస్టేబుల్ మృతి పై పెరుగుతున్న అనుమానాలు

అది ఏపీ లో పోలింగ్ రసవత్తరంగా జరుగుతోన్న సమయం..ఎన్నికల విధులకు వెళుతూ ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. కానిస్టేబుల్ వెళ్తున్న వాహనంపైకి ఇన్నోవా కారు దూసుకువచ్చిన తీరు అనుమానాల్ని రేపుతోంది.. మితి మీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదం జరిగిందా? లేక ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? రోడ్డు ప్రమాదం ద్వారా ఆమెను చంపే ప్లాన్ వేశారా ?ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

విశాఖపట్నంలో ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళా పోలీస్ లక్ష్మికాంతం మరణంపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రమాద సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన పోలీస్ లు ఆమెది ప్రమాదం కాదు హత్యేనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 11న వాహనంపై అక్కిరెడ్డిపాలెంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వెళ్తున్న కానిస్టేబుల్ ని పంజాబ్‌ జంక్షన్‌ నుంచి వస్తున్న ఇన్నోవా కార్‌ ఢీకొట్టింది. దీనితో అక్కడికక్కడే ఆమె మృతి చెందారు.

మరోవైపు సంఘటనా సమయంలో ఇన్నోవా వాహానం ఢీకొన్న విధానం.. వాహనంపై లక్ష్మీకాంతం వెళ్తున్న తీరును గమనించిన పోలీస్ లకు ఇన్నోవా కారు ముందుకు దూసుకువచ్చే విధానం అనుమానాల్ని మరింత పెంచింది. కానిస్టేబుల్‌ను ఢీకొన్న ఇన్నోవా నెల్లూరు అడ్రస్ పై రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీస్ లు గుర్తించారు. ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? రోడ్డు ప్రమాదం ద్వారా ఆమెను చంపే ప్లాన్ వేశారా అనే కోణంలో పోలీస్ లు విచారణ చేస్తున్నారు.

ఇక వైజాగ్ నేషనల్ హైవే 16 మీద ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు, మిగిలిన వారికి ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మహిళా హెడ్ కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *