ప్రియాంక నియోజకవర్గంపై సస్పెన్స్‌

ప్రియాంక నియోజకవర్గంపై సస్పెన్స్‌

కాంగ్రెస్‌లో అత్యంత క్రియాశీల నేతల్లో అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రియాంక గాంధీ. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయంలో ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అసలు ప్రియాంకా గాంధీ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానంటోంది? ఒక వేళ అదే జరిగితే.. ప్రస్తుత ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద పోటీ అక్కడే ఉండబోతోందా? ప్రియాంకా గాంధీ పోటీ విషయంలో రాహుల్‌ గాంధీ కొనసాగిస్తోన్న ఆ సస్పెన్స్‌ ఏంటి?

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ తూర్పు ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక ప్రచారంలో నానమ్మ ఇందిరాగాంధీలానే జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. మొదటి విడత, రెండోవిడత ప్రచార పర్వంలోనూ తన దైన శైలిలో… ప్రత్యర్థి బీజేపీ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీయే లక్ష్యంగా ప్రతి ఎన్నికల సభలోనూ విరుచుకుపడుతున్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు, మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. మహిళా భద్రత కోసం చేసిందెంటో చెప్పాలని నిలదీశారు. ఐదేళ్ల మోదీ పాలనలో అభివృద్ధి జరగలేదనిప్రియాంక ఆరోపించారు.

ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్నదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత మాత్రం రావట్లేదు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే చెప్పనంటూ సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీని పోటీకి నిలబెడతారా అంటూ మీడియా ప్రతినిధి రాహుల్‌ను ప్రశ్నించారు. ప్రియాంక పోటీ విషయం సస్పెన్స్‌లోనే ఉంచుతానన్నారు. సస్పెన్స్‌ అనేది ఎప్పుడూ చెడ్డ విషయం కాదని చెప్పారు. వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేయడం అనే వార్తను ధృవీకరించడం లేదని.. అలాగని తోసిపుచ్చడం లేదని రాహుల్ అన్నారు. మరోవైపు తన తల్లి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని ఇటీవల కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రియాంకని కోరారు. దానికి ఆమె స్పందిస్తూ.. తాను పోటీ చేసే స్థానం వారణాసి ఎందుకు కాకూడదంటూ తిరిగి ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే పార్టీ కోరుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం అధ్యక్షుడు రాహుల్ గాంధీ… యూపీలోని అమేథీతోపాటూ… కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాహుల్ తల్లి సోనియాగాంధీ యూపీలోని రాయ్ బరేలీ నుంచీ మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీతోపాటూ యూపీ పశ్చిమ బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతిరాధిత్య సింథియాను ఎక్కడి నుంచీ బరిలో దింపేదీ కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆయన్ని కూడా యూపీలోనే బరిలో దింపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి ఉన్నవి రెండు సీట్లే. ఒకటి అమేథీ, రెండోది రాయ్ బరేలీ. ఆ రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలు ఉండటంతో కాంగ్రెస్ వీలైనంత మందిని అక్కడ గెలిపించుకోవాలని చూస్తోంది.

సాధారణంగా ప్రియాంక గాంధీ లాంటి నేతలను కాంగ్రెస్ పార్టీ… తమకు కంచుకోటగా ఉండే నియోజకవర్గం నుంచీ బరిలో దింపుతూ ఉంటుంది. అలాంటిది ఈసారి మాత్రం ఆమెను బీజేపీకి కంచుకోటగా మారిన, నరేంద్ర మోదీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే ప్రియాంక అలహాబాద్‌, ప్రయాగ్‌ రాజ్‌ నుంచి వారణాసి వరకు.. గంగా యాత్ర నిర్వహించారు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా కూడా ఆమె వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మరోవైపు వారణాసిలో కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ప్రియాంక గాంధీ పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వారణాసి నుంచి ప్రియాంక గనుక బరిలోకి దిగితే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నిక ఇదే అవుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *