గాజు పెంకుల బాల్యం... మొట్టమొదటి భారతీయుడు సురేష్‌ రైనా

గాజు పెంకుల బాల్యం... మొట్టమొదటి భారతీయుడు  సురేష్‌ రైనా

సురేష్‌ రైనా… ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన వాళ్లలో ఈ ఎడమచేతి వాటపు బ్యాట్సమన్‌ కూడా ఒకడు. అన్ని ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకుని, ఎన్నో టీం ఇండియా విజయాల్లో కీ రోల్‌ను పోషించాడు. ఫీల్డ్‌లో మెరుపువేగంతో ఉండే భారత ఆటగాళ్లను లెక్కపెడితే, రైనా మొదటివరుసలోనే ఉంటాడు. అతి సునాయసంగా బంతిని బౌండరీకి తరలించగల వాళ్లలో రైనాకూ స్థానం ఉంటుంది. కష్ట సమయాల్లో బంతితో మాయచేసి, ప్రత్యర్థుల వికెట్లను గిరాటేసిన సందర్భాలూ ఉన్నాయి. క్రీజ్‌లో రైనా ఉన్నాడంటే… జట్టును తీరానికో, భారీస్కోర్‌ దిశగానో తీసుకెళ్తాడని ప్రేక్షకులో ఒకనమ్మకం. అదే రైనా ఫీల్డింగ్‌లో ఉన్నాడంటే దూసుకుంటూ పోతున్న బంతికి అడ్డంగా గోడకట్టగలగడన్న భరోసా. ఈ రోజు 32వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ అరుదైన భారత క్రీడాకారుణ్ని ఒకసారి తలుచుకుందాం.

Happu Birthday Raina

గాజుపెంకుల బాల్యం…

రైనాది పేద కుటుంబం. చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో, చదువుతో పాటు ఆటనూ కొనసాగించడం మహాకష్టంగా ఉండేది. ఆ రోజుల్ని గడపడం, గాజుపెంకులపై నడిచినంత కష్టంగా ఉండేది. అయినా అవన్నీ దాటుకుని వచ్చాడు. కోట్లమంది హృదయాల్లో నిలబడ్డాడు. రైనా బాల్యాన్ని ఎలా ఈదాడో ఒక ఉదాహరణతో చెప్పుకోవచ్చు. అప్పుడు రైనాకి పదేళ్ల వయసు. కోచింగ్‌ సెంటర్‌ ఇంటికి బాగా దూరంగా ఉండేది. సరైన తిండి తినడం కూడా కష్టంగా ఉండేది. కోచింగ్‌ వెళ్లి రావడానికి లోకల్‌ ట్రైన్‌ టిక్కెట్టుకు కూడా డబ్బులు కూడబెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ల నాన్నకు ఉండేది. ఇక పౌష్టికాహారం సంగతి సరేసరి. ట్రైన్‌ టిక్కెట్టుకు ఇచ్చిన ఆ చిల్లర డబ్బులనే జాగ్రత్త చేసుకునేవాడు. ఎవరినైనా లిఫ్డ్‌ అడిగి, స్టేడియానికి చేరుకునేవాడు. ఎవరూ లిఫ్ట్‌ ఇవ్వనిరోజున పరిగెత్తి చేరుకునేవాడు. మిగల్చిన ట్రైన్‌ టిక్కెట్టు డబ్బులను గుడ్లు కొనుక్కుని తినడానికి ఉపయోగించుకునేవాడు. బాల్యమంతా ఇలాంటి ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చాడు. ఆ కష్టాలే ప్రతికూలతల్లో పోరాడటాన్ని నేర్పాయి. టీం ఇండియాలో ఒకణ్ని చేశాయి. కోట్ల మంది హృదయాల్లో నిలిపాయి.

Happy Birthday Suresh raina

మొట్టమొదటి భారతీయుడు…

టీంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రైనా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. తనదైన శైలితో బంతిని బౌండరీకి తరలిస్తుంటే చూడముచ్చటగా ఉండేది. టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ, టీ20 ల్లోనూ తనని తాను నిరూపించుకున్నాడు. మూడు ఫార్మాటుల్లోనూ శతకాలు సాధించిన తొలి భారతీయుడయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌, రాహుల్‌లు ఈ ఘనతను సాధించారు. ఐపీఎల్‌లోనూ ఎన్నో అరుదైన రికార్డులు రైనా పేరున రాసిపెట్టి ఉన్నాయి. 2005 లో టీం ఇండియా వన్డే జట్టులో అడుగుపెట్టినప్పటి నుండీ ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతాను ప్రపంచానికి చూపించాడు. 2014 ఐపీఎల్‌లో 25 బంతుల్లో 87 పరుగులు సాధించిన ఇన్నింగ్స్‌ను చూసిన వారెవరైనా రైనాను ఎప్పటికీ మర్చిపోలేరు. అదే మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 33 పరుగులు రాబట్టి, తన స్టామినా ఏంటో చూపించాడు. అలాంటి ఇన్నింగ్స్‌లు భారత్ తరపున ఎన్నో ఆడాడు. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఇలా రైనాకంటూ ఒక స్థాయి ఏర్పడింది. అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలోకి చేరిపోయాడు.

Happy Birthday Suresh raina

నమ్మకం ఉంది…

కొంతకాలంగా రైనా ఫాం కోల్పోయాడు. టీంలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తున్నాడు. అడపాదడపా మంచి ఇన్నింగ్సులే ఆడుతున్నా, తన స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చే ఆలోచనలో టీం ఉండటంతో రైనాకు అవకాశాలు తగ్గిపోయాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, రైనా పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఫీల్డ్‌లో చెలరేగిపోయే పాత రైనాను త్వరలోనే చూపించడానికి సై అంటున్నాడు. అభిమానులూ వచ్చే వరల్డ్‌ కప్‌లో రైనా ప్రదర్శన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అన్ని విధాలుగా మరింత పదునుతో రైనా మళ్లీ టీంలోకి రాబోతున్నాడు. మరింతలకు మరింత మనల్ని అలరిచబోతున్నాడు. ఈ అరుదైన ఆటగాడి పేరిట మరిన్ని రికార్డులు నమోదవ్వాలని కోరుకుంటూ… మోజో టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Happy Birthday Suresh Raina

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *