ఉగ్రదాడులను అడ్డుకోలేకపోయాం..క్షమాపణలు చెప్పిన శ్రీలంక

ఉగ్రదాడులను అడ్డుకోలేకపోయాం..క్షమాపణలు చెప్పిన శ్రీలంక

ఈస్టర్‌ డే నాడు శ్రీలంక బాంబులతో దద్దరిల్లింది. వరుస బాంబ్ బ్లాస్ట్‌లతో శ్రీలంక చిగురుటాకుల వణికింది. చర్చలు, హోటళ్లు టార్గెట్‌ గా దాడులు జరిగాయి. పేలుళ్లకు 321 కి పైగా మరణించారు. మరో వైపు పేలుళ్లకు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఉగ్రమూకలు రెచ్చిపోయారని తెలుస్తోంది.

ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో సాగిన ఉగ్రవాద బీభత్సం అత్యంత అమానుషమైనది. రాజధాని కొలంబోతో సహా పర్యాటక ప్రాంతాల్లోని చర్చిలు, విలాసవంతమైన హోటళ్ళు లక్ష్యంగా సాగిన ఈ మారణకాండలో మరణించినవారి సంఖ్య మూడువందలకు చేరుకుంది. చర్చిల్లో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, హోటళ్ళలో పర్యాటకులు అల్పాహారానికి గుమిగూడినప్పుడు దాడులు జరగడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉన్నది. గాయాల కారణగా ఒక్క రాత్రిలోనే ఏడుగురు మరణించారు. అయితే కొలంబోలో సోమవారం సాయంత్రం మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకొంది. దీంతో ఆర్మీ సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టింది. కొలంబో ప్రధాన బస్‌స్టేషన్ వద్ద 87 బాంబులను గుర్తించిన ఆర్మీ ఆ బాంబులను నిర్వీర్యం చేసింది.

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్చర్చ్‌ ప్రాంతంలో జరిగిన దాడికి ప్రతీకారంగానే తమదేశంలో ఉగ్రమూకలు రెచ్చిపోయారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు శ్రీలంక డిప్యూటీ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. శ్రీలంకలో బాంబు దాడులు చేసినవారు మా కోసం పోరాడేవారే’ అని ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ఉగ్రవాదానికి మద్దతు తెలిపె అమఖ్‌ వార్తా సంస్థకు ఐసిస్‌ తెలిపింది. అంతేకాదు ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాదుల పేర్లను ఐసిస్‌ ప్రకటించింది. అయితే ఉగ్రదాడులపై నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ వాటిని అడ్డుకోవడంలో వైఫల్యం చెందడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు కోరింది. హెచ్చరికను ఏ మాత్రం పట్టించుకున్నా ఏడుగురు భారతీయులు సహా యాభైమంది విదేశీయులను సైతం బలితీసుకున్న ఈ ఘాతుకాన్ని కొంతమేరకైనా నివారించగలిగేవారు. క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్న చాలా దేశాల్లో ఈస్టర్‌నాడే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. మరోవైపు లారీ, వ్యానులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో శ్రీలంకలోని అన్ని పోలీసు స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *