నెల్లూరులో వైసీపీ దూకుడు..అడ్డుకట్ట వేస్తామంటున్న తమ్ముళ్లు

నెల్లూరులో వైసీపీ దూకుడు..అడ్డుకట్ట వేస్తామంటున్న తమ్ముళ్లు

ఆ జిల్లాలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని అధికార పార్టీ పరితపిస్తుండగా, ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామని ప్రతిపక్ష అంటోంది. హేమీహేమీలంతా వైసీపీ గూటికి చేరడంతో, ఆ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. అన్ని స్థానాలు తమవే అంటున్నారు. మీకన్నా ఓ సీటు ఎక్కువే సాధిస్తామంటూ తమ్ముళ్లు వారికి సవాల్ విసురుతున్నారు. దీంతో, నెల్లూరు జిల్లా రాజకీయం హాట్ హాట్ గా మారింది.

రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లాది ప్రత్యేక స్థానం. కుల సమీకరణాలు, వర్గ రాజకీయాలతో నెల్లూరు రాజకీయం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. గత నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను రెడ్డి సామాజిక వర్గమే శాసిస్తోంది. తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నెల్లూరు జిల్లాను, 2014 ఎన్నికల్లో వైసీపీ ఆక్రమించింది. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 7 చోట్ల గెలుపొందగా, టీడీపీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుపొందింది. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైపీసీ నుంచి గెలిచిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌‌ టీడీపీలో చేరారు. మరోసారి టీడీపీ ఆయనకే టిక్కెట్ కేటాయించింది. ఇదిలా ఉంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మేకపాటి, ఆనం ఫ్యామిలీలు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి మేకపాటి కుటుంబం జగన్ వెన్నంటే ఉండగా, గత ఎన్నికల తర్వాత ఆనం బ్రదర్స్ టీడీపీలోకి వెళ్లారు. వివేకా మరణానంతరం ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరి దూకుడు కొనసాగిస్తున్నారు.

తమకు పట్టున్న జిల్లాలో మరోసారి సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి టిక్కెట్ నిరాకరించి అక్కడి నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పోటీకి దించింది. అయితే రాజమోహన్‌రెడ్డి సోదరుడు, కుమారుడికి మాత్రం వైసీపీ టికెట్లు ఇచ్చింది. ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మరోసారి బరిలో దిగుతుండగా, ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఆనం రాంనారాయణరెడ్డి ముందుగా ఆశించినట్లే వెంటకగిరి టికెట్ దక్కించుకుని పంతం నెగ్గించుకున్నారు. ఆనం, ఆదాల చేరికతో పార్టీకి మరింత పట్టు దొరికిందన్న ఉత్సాహం వైసీపీలో కనిపిస్తోంది. దీంతో ఈసారి జిల్లాను క్లీన్‌స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఆదరణ, నవరత్నాల హామీలు, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది.

జిల్లాలో సోమిరెడ్డి, నారాయణకు మంత్రి పదవులిచ్చినా పార్టీ బలపడిందేమీ లేదన్న అభిప్రాయం టీడీపీ కేడర్‌లో వినిపిస్తోంది. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ నష్టపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీకి గట్టి పట్టున్న నెల్లూరులో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక, 2004లో జిల్లాలో తిరుగులేని ఆధిక్యం సంపాదించిన కాంగ్రెస్, 2014లో జీరోగా మిగిలింది. ఆ పార్టీ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో దాని ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన ప్రభావం ఎలా ఉంటుందన్నది జిల్లాలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు…. కావలిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మొత్తంగా నెల్లూరులో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీల మధ్యే ఉండనున్నా…జనసేన కూడా కొంత మేర ప్రభావం చూపే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో పాగా వేయనున్న పార్టీ ఏదో ఎన్నికల తర్వాత గానీ తేలనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *