పది పడవల ప్రయాణం కాంగ్రెస్‌కు పనికొస్తుందా...!?

పది పడవల ప్రయాణం కాంగ్రెస్‌కు పనికొస్తుందా...!?

“ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఎవరితో కలవడానికైనా సిద్ధంగా ఉండాలి” ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న సోనియాగాంధీ కలలను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలన్నింటితోనూ కాంగ్రేస్‌స్నేహహస్తం చాస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 23న తమతో భేటీ కావాలంటూ దేశంలోని ప్రాంతీయ పార్టీలకు చెందిన  నాయకులకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఈ భేటీకి హాజరు కావాలంటూ సోనియాగాంధీయే స్వయంగా లేఖలు పంపడం విశేషం. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అయితే పది పార్టీల కలగూరగంపతో కాంగ్రెస్ పార్టీ ఎలా నెట్టుకొస్తుందన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. వివిధ రాష్ట్రాల్లో బద్ధ వైరం ఉన్న పార్టీలను కలుపుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం సాధ్యమేనా అని సర్వత్రా ప్రశ్నలు వస్తున్నాయి. పెద్దగా రాజకీయ అనుభవం లేని రాహుల్ గాంధీ తలలు పండిన నాయకులతో ఎలా నెట్టుకొస్తారా… అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైకి స్నేహంగా కనిపిస్తున్న ఏ రెండు రాజకీయ పార్టీలకూ చెందిన నాయకులకు మధ్య సత్సంబంధాలు లేవని అందరూ చెబుతున్న మాట. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా నివారించడమే లక్ష్యంగా అన్ని పార్టీలతో కలవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తు భయం…

తెలుగు రాష్ట్రాలలో ఉప్పు నిప్పుగా ఉన్న పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలపడం అనేది భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనని కాంగ్రెస్ నాయకులూ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.  జాతీయస్థాయిలో తమతో కలిసినా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల పాలు చేస్తారో అనే ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. సమయానుకూలంగా తనకు పనికివచ్చే ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా కేసీఆర్ వెనుకాడరనీ, ఇలాంటి మనస్తత్వం ఉన్న వారితో కాంగ్రెస్ చేతులు కలపడం భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేస్తుందనే అనే అనుమానం తెలంగాణ కాంగ్రెస్ నాయకులను వేధిస్తోంది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వై.ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరు యుద్ధం  ప్రకటించినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఇద్దరికీ తాము ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలంటూ కాంగ్రెస్ అధిష్టానం లేఖ పంపింది. శాసనసభ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి లోక్‌సభలో ఈ రెండు పార్టీలకూ ఎన్ని సీట్లు వచ్చినా వారిద్దరినీ కలుపుకొని పోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటున్న సమయంలో జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు ఏ మేరకు సహకరిస్తాయన్నది అంతు పట్టకుండా ఉంది. ఇక పూటకో మాట మాట్లాడే డీఎంకే అధికారంలో భాగస్వామి అయితే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో అనే భయం కాంగ్రెస్‌ను వేధిస్తోంది. ఈ పార్టీల సంగతి పక్కన పెడితే… ఉత్తరాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కప్పల తక్కెడ వంటివేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరు ఎప్పుడు ఎలాంటి షరతులు విధిస్తారు… ఎలాంటి డిమాండ్లు పెడతారనే భయం కాంగ్రెస్‌ను నిత్యం వెంటాడుతూనే ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలో ఇన్ని పార్టీల కిచిడి ప్రభుత్వాన్ని రాజకీయానుభవం తక్కువగా ఉన్న రాహుల్ గాంధీ ఎలా నెట్టుకొస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *