హామీల సంగతి సరే...ఉన్న 50 లక్షల ఉద్యోగాలు కూడా మాయం!

హామీల సంగతి సరే...ఉన్న 50 లక్షల ఉద్యోగాలు కూడా మాయం!

నవంబర్ 8, 2016…ఈ తేదీని భారతదేశంలోని ప్రతి పౌరుడు మర్చిపోరు. ప్రధానిగా నరేంద్రమోదీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాత్రికి రాత్రి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దయ్యాయి. దాదాపు 80 శాతం నోట్లకు ఎటువంటి విలువ లేకుండా పోయింది. మరుసటి రోజు నుంచి దేశంలోని ప్రజలందరు బ్యాంక్ క్యూలలో నుంచుని తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇంకా దారుణం ఏంటంటే కొందరు క్యూలో నిల్చోలేక మరణించిన వారు ఉన్నారు. మరికొందరు హాస్పిటల్‌లో ఉండి, తమకు కావాల్సిన సొమ్ము సమయానికి అందక చనిపోయిన వారూ ఉన్నారు.

సరైనా మార్గనిర్దేశకాలు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు జేబునిండా డబ్బున్నా బికారుల్లా మారిపోయారు. అంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం తన నిర్ణయాన్ని పునరాలోచించలేదు. పైగా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే దేశభక్తి లేకపోవడమేనని ప్రజలను మానసిక ఆందోళనలోని నెట్టేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరగకుండా ఉండటానికి మోదీ తన ప్రసంగంలో ‘నాకు యాభై రోజుల సమయమివ్వండి. నోట్ల రద్దు వల్ల ఏ ఉపయోగం లేకపోతే నన్ను ఉరి తీయండీ అని ఉద్వేగాన్ని ప్రదర్శించారు. మోదీకి వంతపాడుతూ బీజేపీలోని నాయకులు, కార్యకర్తలు, అనుయాయులు…ఎవరైనా మోదీ నిర్ణయాన్ని కాదంటే దేశం వదిలిపోవచ్చనే స్థాయి వరకూ వెళ్లింది. గతం నుచి ప్రస్తుతంలోకి వస్తే…మళ్లీ ఎన్నికలు వచ్చాయి. నోట్ల రద్దు జరిగి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచింది. నోట్ల రద్దు వల్ల కలిగిన లాభాలేంటో చెప్పకుండా బీజేపీ మళ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. నిజంగా నోట్ల రద్దు వల్ల లాభాలే కలిగి ఉంటే ఈపాటికి మోదీ, అమిత్‌షాతో పాటు బీజేపీ వర్గమంతా నోట్ల రద్దు పేరు చెప్పి ప్రచారంతో ఊగిపోయేది. కానీ ఏ ఒక్కరు కూడా నోట్లరద్దు మాటను ఎత్తడంలేదు. పోనీ వారు చెప్పకపోయినా నోట్లరద్దు ప్రజలకేమైనా ఒరిగిందా అంటే…ఏ ఒక్కరు చెప్పలేరు. ఇక నష్టాల గురించి మాత్రం పేజీలకు పేజీలు చెప్పుకోవచ్చు.

నోట్ల రద్దుతో దేశంలోని బ్లాక్ మనీని అంతం చేయవచ్చని, డిజిటల్ మనీని ప్రోత్సహించాలని, ఆదాయపన్ను ఎగవేతలను నివారించవచ్చని నోట్ల రద్దు ప్రభావం ఉన్నన్ని రోజులు బీజేపీ చెప్పిన మాటలు. ఇక తాజాగా…అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘ద స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2019’ పేరుతో రూపొందించిన నివేదికలోని వివరాల ప్రకారం…నోట్ల రద్దు వల్ల దేశంలో 2016 నుంచి 2018 మధ్య కాలంలో 50 లక్షల ఉద్యోగాలకు ఎసరు పడిందని నివేదిక చెబుతోంది. మన దేశంలో 2011 నుంచి నిరుద్యోగం పెరుగుతోంది. 2016 నుంచి 2018 మధ్యకాలంలో ఉపాధి అవకాశాలు ఇంకా ఘోరంగా తగ్గాయి. ఇదే సమయంలో నోట్ల రద్దు జరిగింది. 2000 నుంచి 2011 మధ్య 3 శాతంగా ఉన్న నిరుద్యోగం, 2018లో 6 శాతానికి వచ్చింది అంటే రెట్టింపైంది. ఉద్యోగాలు పోయిన వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువ మంది ఉన్నారు. 20-24 ఏళ్ల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగం ఎక్కువగా నమోదవుతోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) పిరమిడ్స్‌ ఆఫ్‌ సర్వేలోని డేటా ఆధారంగా నివేదిక రూపొందించారు. నోట్ల రద్దుకు, నిరుద్యోగానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నా, లేకపోయినా.. ఈ రెండు యాదృచ్ఛిగంగానే జరిగాయి. ఈ సర్వేను నాలుగు నెలల్లో మూడు విధాలుగా నిర్వహించింది. ఇదే సమయంలో మొత్తం మీద నిరుద్యోగ రేటు 3 శాతం రికార్డు అయితే.. విద్యావంతులై ఉండి.. నిరుద్యోగులుగా మారిన వారు 10శాతం వరకు పెరిగారు. 2011లో 9 శాతం పెరిగితే.. 2016లో 15 నుంచి 16 శాతం నిరుద్యోగ రేటు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది

ఇపుడు మళ్లీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో…మోదీ కొత్త హామీలేమీ ప్రకటించకపోయినా పర్లేదు కానీ గతంలో చెప్పిన నోట్ల రద్దు లాభాలు, మేక్ ఇన్ ఇండియా ప్రభావాలు, స్వచ్ఛ భారత్ ఉపయోగాలు ఏమయ్యాయో ఎన్నికల ప్రచారంలో చెబితే వినాలనుందని ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నత విద్యావంతులు కొందరు అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పకుండా దాటవేసే నేర్పు మోదీకి, బీజేపీకి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో దేశ యువత మానసిక క్షోభకు బాధ్యత వహిస్తుందా లేదా అనే అనుమానానికైనా చెప్పగలిగితే సంతోషమని యువత నుంచి వస్తున్న సూటి ప్రశ్న. మళ్లీ మోదీనే గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు, కొన్ని సర్వేలు చెబుతున్నాయి సరే..ఈసారైనా మోదీ ఇచ్చిన పాత హామీలనే నెరవేర్చే దిశగా అడుగులు వేస్తే బాగుండునని మధ్యతరగతి వర్గం తమ ఆశలను వ్యక్తపరుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *