సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

తెలుగుతెరపై అత్యుత్తమ నటుల్లో ఒకరైన రాళ్లపల్లి కన్నుమూశారు. రాళ్లపల్లి కొన్నాళ్లుగా శ్వాసకోస సమస్యతో బాధపడుతూ మనల్ని వీడి వెళ్లిపోయారు.1955 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు రాళ్లపల్లి. ఆ టైమ్ లో అందర్లానే రాళ్లపల్లికి కూడా నాటకాలపై ధ్యాస ఎక్కువైంది. కాకపోతే కేవలం నాటకాల్ని చూసి ఆనందించి వదిలేయలేదు. దానిపై అవగాహన పెంచుకున్నారు. రాయడం, దర్శకత్వం వహించడం, నటించడం లాంటి ఎన్నో రంగాల్లో అనుభవం సంపాదించారు. అలా తన కెరీర్ లో 8వేలకు పైగా నాటకాల్లో నటించారు రాళ్లపల్లి. ఎన్ని సినిమాలు చేసినా నాటకంలో నటించకపోతే రాళ్లపల్లికి తృప్తి ఉండేది కాదు. అందుకే ఆయన జీవితంలో నాటకం ఓ భాగమైంది.

1973లో వెండితెరకు పరిచయమయ్యారు రాళ్లపల్లి. అప్పటికే నాటకాల్లో నటించిన అనుభవం ఉండడంతో సినిమా రంగంలో రాణించడం నల్లేరుపై నడకలా మారింది. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, అభిలాష, శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రాళ్లపల్లి.. చాలా తక్కువ కాలంలోనే దర్శకుల నటుడిగా మారిపోయారు. చివరికి వంశీ, జంధ్యాల లాంటి నటులు రాళ్లపల్లి లేకుండా సినిమా చేయలేని పరిస్థితికి వచ్చేశారు. అలా తన కెరీర్ లో 850కి పైగా సినిమాల్లో నటించారు రాళ్లపల్లి. 3 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. అయితే లెక్కలేనన్ని సినిమాలు చేసినా, నాటక రంగానికి దూరమయ్యాననే బాధ మాత్రం ఆయన్ను వెంటాడుతూ ఉండేది. వరుసగా 10 సినిమాలు చేసినప్పటికీ, ఒక్క నాటకంలోనైనా నటించాలనే కోరిక ఆయనకు ఉండేది. అందుకే ఒక దశలో సినిమాల కంటే ఎక్కువగా నాటకాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రస్తుతం పరిశ్రమలో నటులు, రచయితలుగా కొనసాగుతున్న తణికెళ్ల భరణి లాంటి ఎంతోమంది ప్రముఖులకు రాళ్లపల్లి గురుతుల్యులు. సినీ పరిశ్రమ నుంచి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేని నటుల్లో రాళ్లపల్లి ఒకరు. ఎన్ని మంచి పాత్రలు వేసినా, ఎంత కష్టపడినా ఇండస్ట్రీ తనను బి-కేటగిరీ నటుడిగానే చూసేదని ఓ సందర్భంలో చెప్పుకున్నారాయన. పరిశ్రమ గుర్తించకపోయినా రాళ్లపల్లిని ప్రజలు గుర్తించారు. ఆయన సినిమాలు, అందులో పాత్రలు కలకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *