మేము 500 చేస్తాం..బంగ్లాను 50కే ఆలౌట్!

మేము 500 చేస్తాం..బంగ్లాను 50కే ఆలౌట్!

వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఇప్పటిదాకా ఇండియా, పాక్ మధ్య మ్యాచ్‌కోసం కొన్ని కోట్ల మంది ఎదురుచూశారు. అయితే..అంతకుమించిన ఉత్కంఠను రేకెత్తించే ఆట శుక్రవారం జరగనుంది. అదెలాగంటారా!? ఇప్పటికే సెమీస్‌పై ఆశలు కోల్పోయి ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన పాకిస్తాన్ జట్టుకు ఈరోజు లీగ్ మ్యాచ్ ఆఖరిది. అది కూడా ఈ మధ్య పెద్ద జట్లకు షాక్ ఇస్తున్న బంగ్లాదేశ్‌తో కావడం మరింత విచారకరం. అయితే…పాకిస్తాన్ టీమ్ కెప్టెన్ మరో షాక్ ఇచ్చాడు.

ఊహించని రేంజ్‌లో గెలవాలి!

ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచులాడిన పాక్సితాన్…నాలుగింటిలో గెలిచి, మూడింట్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 9 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక లీగ్ దశను దాటి సెమీస్‌కి వెళ్లాలంటే ఆఖరి మ్యాచ్‌లో ఊహించని స్థాయిలో గెలిస్తే తప్పించి సెమీస్ ఆశలు లేవు. పాకిస్తాన్‌కు ఇది అసాధ్యమైనది. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద జట్లకే చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి దశలో పాకిస్తాన్ అత్యంత భారీ స్కోర్ తేడాతో మ్యాచ్ గెలవాలంటే అసాధ్యమైన పనే..! ప్రస్తుతం వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా 14 పాయింట్లతో, భారత్ 13 పాయింట్లతో, ఇంగ్లాండ్ 12 పాయింట్లతో ఉండగా…మిగిలిన ఒక స్థానం కోసం న్యూజిలాండ్ 11 పాయింట్లతో, పాక్సితాన్ 9 పాయింట్లతో పోటీపడుతున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాక్ గెలిస్తే 11 పాయింట్లతో న్యూజిలాండ్‌తో సమంగా నిలుస్తుంది. కానీ…రన్‌రేట్ ప్రకారం న్యూజిలాండ్ +0.175 ఉండటం వల్ల పాకిస్తాన్ -0.792 వెనకబడి ఉంటుంది. పాయింట్లు సమంగా ఉన్నా..రన్‌రేట్ పరంగా కివీస్ జట్టు సెమీస్‌కి చేరుకుంటుంది. అయితే…రన్‌రేట్ పెరగాలంటే పాక్ జట్టు భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది.

బంగ్లాను 50 లోపే ఆపేస్తాం…

ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. పాకిస్తాన్ జట్టు మొదట టాస్ గెలిస్తేనే సెమీస్‌కు వెళ్తుంది. లేదంటే నిష్క్రమించినట్టే…ఒకవేళ టాస్ గెలిచినా…స్కోర్‌ని 350 పరుగుల వరకూ చేసినా బంగ్లాదేశ్‌పై 311 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇంత భారీ తేడాతో గెలవడం అసాధ్యమే! కనీవినీ ఎరుగని ఈ రికార్డ్ గురించి పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడుతూ..’మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం. మేము 500 లేదంటే 400 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను 50 పరుగుల లోపు ఆలౌట్ చేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి. పాక్ కెప్టెన్‌పై సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *