శ్రీకాళహస్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

శ్రీకాళహస్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

కష్టం వస్తే కాపాడమని ఎవరైనా దేవుడిని మొక్కుతారు. మరి ఆయనకే ఏదైనా ఆపద వస్తే..? వినడానికే వింతగా ఉంది కదా.. కానీ శ్రీకాళహస్తి శివుడికి అంతటి దేవుడికే కష్టం వచ్చింది. ఉన్నపళంగా తానుండే చోటును ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది . దేవుడేంటి… పైగా ఆయనకే కష్టమేంటి… అనేగా మీ అనుమానం.. ఈ స్టోరీ చూస్తే అది తీరిపోతుంది.

ఈ కపాలాన్ని చూడండి.. ఒళ్లు జలదరించడం లేదూ.. ఇదిగో ఈ ఎముకలని పరిశీలించండి.. శరీరం వణికపోవడంపోవడం లేదూ..ఈ దృశ్యాలని ఒక్కసారి చూస్తే పది రోజుల వరకూ భయం పోయేలా లేదు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం ఇది నిత్యం కనిపించేదే. కారణం ఇసుక మాఫియా!

అవును శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. విచ్చలవిడి తవ్వకాలతో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే స్వర్ణముఖి నదిని గుల్ల చేసిన అక్రమార్కులు.. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న శ్మశానంపై పడ్డారు. ఇక్కడి సమాధులని పెకిలించి మరీ… ఇసుకను తోడేస్తున్నారు. సిమెంట్‌ దిమ్మలు కూలిపోవడంతో.. ఎక్కడికక్కడ మృతదేహాల అవశేషాలు బయటపడుతున్నాయి. ఎటు చూసినా కళేబరాలు, పుర్రెముకలే దర్శనమిస్తున్నాయి. ఆ భయానక వాతావరణాన్ని చూసి స్థానికులు నిత్యం గజగజ వణికిపోతున్నారు.

శ్రీకాళహస్తిలోని పాత ఇరిగేషన్‌ ఆఫీస్ సమీపంలో ఈ శ్మశాన వాటిక ఉంది. పక్కనే స్వర్ణముఖినది ఉండటంతో.. ఈ స్థలం కూడా ఇసుకతో కూడుకొని ఉంది. స్వర్ణముఖి నదిలో లభించే ఇసుకకు తమిళనాడులో మంచి డిమాండ్‌ ఉంది. ఇంకేం నది వైపు నుంచి.. కొంచెం కొంచెంగా శ్మశానాన్ని సైతం ఆక్రమించేశారు. ఇప్పటికే ముప్పావు వంతుకు పైగా తవ్వేసి ఇసుకను తరలించేశారు. ఈ విషయమై గతంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అధికారుల జోక్యంతో కొన్ని రోజులు తవ్వకాలు నిలిపేశారు. కానీ ఆ తర్వాత యధావిధిగా వ్యవహారం సాగిపోతోంది.

23 ఎకరాల విస్తీర్ణమున్న ఈ శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మించాలనే ఆదేశాలు గతంలోనే వచ్చాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఇదే విషయంపై స్థానిక తహసిల్దార్‌ దృష్టికి తీసుకెళ్తే.. ఇసుక అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే వారు చర్యలు తీసుకునేలోపే.. శ్మశానం పూర్తిగా కనుమరుగయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.

కళ్లముందే అక్రమ రవాణా జరుగుతోంటే.. అధికారులు మీనమేషాలు లెక్కించడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అడ్డుకోవాల్సింది పోయి అక్రమార్కులకే ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికైనా అధికారులు వెంటనే కళ్లు తెరవాల్సిన అవసరముంది. స్వర్ణముఖి నదిని ఎలాగు కాపాడుకోలేకపోయారు.. కనీసం శ్మశాన్నానైనా రక్షించండి!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *