వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ

వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ

హైదరాబాద్ వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ కేసులో పోలీసుల పురోగతి సాధించారు. చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌ పనిగా గుర్తించారు. ఇప్పటికే ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లో ఆరుసార్లు దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు 20 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

హైదరాబాద్‌లోని వనస్థలిపురం అటెన్షన్ డైవర్షన్ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 58.97 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. దోపిడికి పాల్పడింది చెన్నైకి చెందిన రాంజీగ్యాంగ్‌గా గుర్తించారు.

మధ్యాహ్నం వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు… మనీ లోడింగ్ వాహనంలో డబ్బులు తీసుకొచ్చారు సిబ్బంది. ఆ సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఇద్దరు దుండగులు… డబ్బులు కింద పడ్డాయని చెప్పి సెక్యూరిటీ గార్డు దృష్టి మరల్చారు. అదే సమయంలో మరో వ్యక్తి వాహనంలోని నగదు పెట్టెను ఎత్తుకుని రోడ్డు దాటాడు. అటుగా వస్తున్న ఓ ఆటోలో పెట్టి రోడ్డు దాటించారు. ఆ తర్వాత అటు వైపు మళ్లీ పెట్టెను మోసుకుంటూ పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి.

గతంలో చెన్నై, బెంగళూరులో ఇలాగే చోరీలు
గతంలో చెన్నై, బెంగళూరులలో కూడా ఇలాగే దోపిడిలు జరిగాయి. ఆ సమయంలో అరెస్టైన వారి ఫొటోలతో సీసీటీవీల్లో రికార్డైన విజువల్స్‌ను పోలీసులు కంపేర్ చేశారు. వాటి ఆధారంగా రాంజీనగర్ గ్యాంగ్ ఈ దోపిడికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందుతుల కోసం చెన్నై, బెంగళూరుకు నాలుగు ప్రత్యేక బృందాలను పంపించారు. త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *