పిల్లల గల్లీ క్రికెట్‌ గొడవ... ఏడు ప్రాణాలను తీసింది

పిల్లల గల్లీ క్రికెట్‌ గొడవ... ఏడు ప్రాణాలను తీసింది

కొన్నికొన్ని సంఘటనలు చాలానే భయపెడతాయి. మనమెలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించుకోమంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పదేపదే హెచ్చరిస్తూ ఉంటాయి. ఇదీ అలాంటి సంఘటనే. చాలా చిన్న విషయంగా మొదలై… అంతకంతకూ పెద్దదై ఏడు ప్రాణాలను కోల్పోయే వరకూ చేరింది. గల్లీ క్రికెట్‌ ఆడుకుంటున్న పిల్లల మధ్య గొడవ, పెద్దల వరకూ చేరి… ప్రాణాలను తీసుకునే వరకూ చేరింది.

చిన్న గొడవే యుద్ధ వాతావరణమైంది…

గల్లీ క్రికెట్‌ అనగానే, చాలామందికి చాలానే జ్ఞాపకాలుంటాయి. ఆ మాట వినగానే ఒక నోస్టాల్జియా ఫీలింగ్‌ వెంటాడుతూ ఉంటుంది. కానీ ఇది అలాంటి జ్ఞాపకం కాదు. దీన్ని తలుచుకుంటేనే భయపెడుతుంది. పిల్లలు ఆడుకునే గల్లీ క్రికెట్లో గొడవలవడం సాధారణమైన విషయం. పొద్దునైన గొడవను సాయంత్రానికి మర్చిపోయి, మరుసటి రోజుకు మామూలైపోతారు. కానీ ఇక్కడ ఆ చిన్న గొడవే యుద్ధవాతావరణానికి కారణమైంది.

అలా జరిగింది…

అది పాకిస్తాన్‌లోని భైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ ప్రాంతం. అబోట్టాబాద్ జిల్లాలోని ఒక ఖాళీ స్థలంలో కొందరు పిల్లలు కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇరుజట్ల మధ్య బ్యాట్స్‌మెన్‌ అవుట్‌ అవడం విషయంలో గొడవ జరిగింది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇరుజట్ల పిల్లలూ రక్తం కారేలా కొట్టుకున్నారు. దీంతో ఈ గొడవ తల్లిదండ్రుల వరకూ వెళ్లింది. ఆ తర్వాత గొడవ మళ్లీ మొదలైంది. ఈ సారి ఇరువైపుల తల్లిదండ్రుల మధ్య వివాదమైంది. రెండువైపుల వాళ్లూ కేస్‌ పెట్టేందుకు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ మళ్లీ గొడవ పునరావృతమైంది. రాజీ చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వాళ్లు పట్టించుకోలేదు. ఒక వర్గంపై మరో వర్గం కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాలకూ చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల జరిపిన వారిపైనా, దాడికి పాల్పడ్డవారిపైనా కేసులు నమోదు చేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *