ఉత్కంఠ రేకెత్తిస్తున్న బీహార్ రాజకీయాలు

ఉత్కంఠ రేకెత్తిస్తున్న బీహార్ రాజకీయాలు

బీహార్ రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి.ఆర్జేడీ కాంగ్రెస్‌లు ఒకవైపు,జేడీయూ-బీజేపీ మరోవైపు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి.బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ పరిపాలన,ప్రధాని మోదీ ఇమేజ్‌పై ఎన్డీయే కూటమి ఆధారపడితే..యూపీఏ కూటమి నితీశ్‌ కప్పదాటు వైఖరిని,కుల సమీకరణ లెక్కలనే అస్త్రాలుగా మార్చుకుంది.2014 ఎన్నికల్లో ఎల్జేపీ,ఆర్ఎల్ఎస్పీతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న బీజేపీ…40 లోక్‌సభ స్థానాల్లో 31 చోట్ల గెలుపొందింది.ఆర్‌జేడీ,కాంగ్రెస్,ఎన్సీపీలు ఏడు స్థానాల్లో నెగ్గాయి.ఇక వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నితీశ్‌కుమార్‌ రెండు స్థానాలకే పరిమితమయ్యారు.ఆ తర్వాత ఏడాదికే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటముల రంగు మారాయి.ఆర్‌జేడీ,జేడీయూ,కాంగ్రెస్‌ మహాగఠ్‌ బంధన్‌గా చేతులు కలిపాయి.బీజేపీ,ఎల్‌జేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌పీ అదేవిధంగా జేడీయూలో చీలిక వర్గమైన మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్‌ అవామ్‌ మోచీ కలిసి పోటీ చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ యూపీఏ కూటమి 178 సీట్లను గెలుచుకోగా..ఎన్డీయే కూటమి 34 శాతం ఓట్లతో 58 సీట్లు సాధించింది.నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా,లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.కానీ వీరి బంధం ఎన్నాళ్లో సాగలేదు.లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో…ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్,బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.గత ఎన్నికల్లో పరస్పరం విమర్శలు గుప్పించుకున్న మోదీ-నితీశ్‌లు,ఈసారి జత కట్టి యూపీఏను ఢీకొంటున్నారు.ఎన్డీయేలో బీజేపీ,జేడీయూ,ఎల్‌జేపీలుండగా…మహాగఠ్‌ బంధన్‌లో కాంగ్రెస్,ఆర్‌జేడీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ,హెచ్‌ఏఎం,జేఏపీ,ఎన్‌సీపీ పార్టీలున్నాయి.సీట్ల సర్దుబాటు కారణంగా ఆర్జేడీ ఈసారి 19 సీట్లలోనే పోటీ చేస్తోంది.ఇప్పటివరకు ఆర్‌జేడీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదు.కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లు కేటాయించడం ఆ కూటమికి మైనస్‌ కావచ్చని అంచనా.ఇక,ఉనికి కోసం పోరాడుతున్న వామపక్షాలు..కొన్ని లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి.

దాణా కేసులో ఆర్‌జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ జైలు పాలు కావడంతో,పార్టీ బాధ్యతలన్నీ లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ భుజస్కందాలపై వేసుకున్నారు.నిరుద్యోగం,రాష్ట్రానికి ప్రత్యేకహోదా సహా పలు అంశాలపై ఎన్టీఏ కూటమిని టార్గెట్ చేస్తున్నారు.బట్టలు మార్చినంత సులువుగా కూటముల్ని మార్చేయగల దిట్ట అంటూ ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు.అంతే స్థాయిలో నితీశ్ సర్కార్ ఆర్జేడీపై విమర్శలు గుప్పిస్తోంది.బిహార్‌లో మారుమూల పల్లెకు కూడా కరెంట్‌ ఉన్నప్పుడు, ఇక లాలూ లాంతర్‌తో పనేముందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.ఇదిలా ఉంటే,ఈసారి సర్వేలన్నీ మోదీ ఇమేజ్,నితీశ్‌ పాలనకు బిహారీ జనం జైకొడతారని అంచనా వేస్తున్నాయి.కుల సమీకరణలు,రంగులు మారే రాజకీయాల కంటే…దేశ భద్రత,అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారుతాయని అంటున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *