నల్లబియ్యంతో హలీమ్...క్యూలు కడుతున్న ప్రజలు

నల్లబియ్యంతో హలీమ్...క్యూలు కడుతున్న ప్రజలు

రంజాన్ మాసం మొదలైందంటే చాలు…అందరికీ గుర్తొచ్చేది హేఎమ్. మాంసాహారం ఇష్టపడే వారికి హలీమ్ ఒక టేస్ట్ డెస్టినేషన్. హైదరాబాద్‌లో ప్రతీ వీధినా హలీమ్ సెంటర్లు తలుపులు తెరుచుకుంటాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు హలీమ్ షాపుల ముందు క్యూలు కనబడతాయి. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హలీమ్‌ని ఇష్టపడతారు.

ఇక హలీమ్ చేయడంలో సిద్ధహస్తులైన పిస్తా హౌస్ దగ్గరైతే జనం బారులు తీరుతారు. పవిత్వ రంజాన్ మాసంలో ఇక్కడ దొరికే హలీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక్కడ తయారుచేసే హలీమ్ విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ఈ పిస్తాహౌస్ నిర్వాహకులు కూడా ప్రతి ఏడాది ఏదోక కొత్త రకం హలీమ్‌ను తయారుచేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలా ఈ ఏడాది రంజాన్ మాసం కోసం పిస్తా హౌస్ తెచ్చిన వెరైటీ బ్లాక్‌రైస్ హలీం..!

సాధారణంగా అయితే గోధుమలు, బియ్యంతో హలీం తయారు చేస్తారు. వీటి స్థానంలో నల్లబియ్యం వాడి బ్లాక్‌రైస్ హలీమ్‌ను తయారుచేస్తోంది పిస్తా హౌస్. బ్లాక్ రైస్‌ను ఒకప్పుడు చైనాలోని విరివిగా వాడేవారు. అక్క‌డ రాజ వంశీయులు మాత్రమే వీటిని తినేవారు. అది క్ర‌మంగా ఈశాన్య భారతంలోకి కూడా ప్ర‌వేశించింది. ముఖ్యంగా మ‌న దేశంలో మ‌ణిపూర్‌లో ఈ బియ్యాన్ని పండిస్తుంటారు. ఈ ప్రాంతం నుంచే విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ నల్లబియ్యంలో ఉండే ఔషధ గుణాలు, అధిక పోషకాల కారణంగా నల్ల బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కువ షోష‌క విలువ‌లు ఉన్న న‌ల్ల బియ్యంతో ఇప్పుడు పిస్తా హౌస్ ప్రజలకు హ‌లీమ్‌ను అందిస్తోంది. న‌గ‌రంలో రోజు రోజుకి ఆరోగ్యంపై అంద‌రికీ పెరుగుతున్న శ్ర‌ద్దే.. త‌మ‌కి ఇలాంటి ఆలోచ‌న రావ‌డానికి కార‌ణమంటోంది పిస్తాహౌస్ యాజ‌మాన్యం.

మ‌రోక‌వైపు డాక్ట‌ర్లు కూడా ఈ బ్లాక్‌రైస్ తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా డ‌యాబెటిస్ త‌గ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయ‌ని చెబుతున్నారు. “న‌ల్ల బియ్యంలో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గాలనుకునేవారు ఈ బియ్యం తింటే మెరుగైన ఫ‌లితాలు కనిపిస్తాయి. గుండెకు సంబంధించిన జ‌బ్బులు కూడా ఈ రైస్ తిన‌డం వ‌ల‌న సమసిపోతాయి” అని ప్ర‌ముఖ న్యూట్రీషియ‌న్ డా.అంజ‌న్ కుమార్ చెప్పారు. హ‌లీమ్‌లో గోధుమలు నేరుగా వేయకుండా ముందుగా గోధమరవ్వను నీటిలో నానబెట్టి మంచి రుచి కోసం మినపప్పు, శనగపప్పు, కందిపప్పును కలుపుతున్నారు. వీటితో పాటు మంచి అరుగుదలకు ఉపయోగపడే జిలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, తోక మిరియాలు, యాలకులు, వెల్లుల్లిలను జత చేస్తున్నారు. దాదాపు 8 గంటల పాటు కట్టెలపొయ్యి మీద వండుతూ హలీమ్ను తయారు చేస్తారు. సాధారణ వాడే బాస్మతి బియ్యం స్థానంలో ఎన్నో ఔషధ గుణాలున్న నల్ల బియ్యాన్ని హలీమ్ తయారీలో వాడ‌డం..ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *