సీనియర్లపై రాహుల్‌ గాంధీ సీరియస్‌ !

సీనియర్లపై రాహుల్‌ గాంధీ సీరియస్‌ !

కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యత‌ల నుంచి తాను త‌ప్పుకుంటానంటూ రాహుల్ గాంధీ భీష్మించుకుని కూర్చున్నారు. ఆయ‌న అసంతృప్తికి కార‌ణం… ఎన్నిక‌ల సంద‌ర్భంగా కొంత‌మంది సీనియ‌ర్లు అనుస‌రించిన వైఖ‌రి అనే అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా కొంత‌మంది సీనియ‌ర్లు వ్యవ‌హ‌రించార‌నీ, ఎన్నిక‌ల‌ను సీరియ‌స్ గా తీసుకోకుండా… వారి వారసుల రాజకీయ భ‌విష్యత్తును మాత్రమే చూసుకున్నార‌నేది రాహుల్ అసంతృప్తిగా తెలుస్తోంది. ఇంత‌కీ… ఆ సీనియ‌ర్లు ఎవ‌రంటే… చిదంబ‌రం, క‌మ‌ల‌నాథ్, అశోక్ గెహ్లాట్!

రాజ‌స్థాన్, మ‌ధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మంచి ఫ‌లితాలు సాధించింది. కానీ, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ప‌రిస్థితి రివ‌ర్స్ అయిపోయింది. దీనికి కార‌ణం క‌మ‌ల‌నాథ్, అశోక్ గెహ్లాట్ల నిర్లక్ష్య వైఖ‌రి అనేది రాహుల్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ త‌మ వారసుల‌కు టిక్కెట్లు ఇప్పించుకోవ‌డం కోస‌మే ఎక్కువ స‌మ‌యం వృథా చేశార‌ట‌! వీరి వార‌సుల‌కు ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చేది లేద‌ని రాహుల్ స్పష్టం చేసినా… ఫ‌ర్వాలేదు, తాము ద‌గ్గరుండి గెలిపించుకుంటామ‌ని ఈ ఇద్దరూ రాహుల్ తో చెప్పారు. దాంతో, కీల‌క‌మైన స‌మ‌యంలో కేవ‌లం వారసుల నియోజ‌క వ‌ర్గాల‌కే ప‌రిమితం అయిపోయి, రాష్ట్రాలో ఇత‌ర ప్రాంతాల్లో వారు ప్రచారం చేయలేనది రాహుల్‌ ఫైర్‌ అవుతున్నారు. ఎన్నిక‌లు జ‌రిగిన రోజున ఓటింగ్ స‌ర‌ళిని కూడా ఈ ఇద్దరూ ప‌ట్టించుకోలేద‌ని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట.

చిదంబ‌రం విష‌యానికొస్తే… ఆయ‌న కుమారుడు కార్తీ చిదంబ‌రానికి సీటు వ‌ద్దు అని రాహుల్ గాంధీ మొద‌ట్లో వ్యతిరేకించారు. అయినా స‌రే, ఇచ్చి తీరాలంటూ చిదంబ‌రం ప‌ట్టుబ‌ట్టారు.
ఆ సంద‌ర్భంలో దాదాపు ఓ ప‌దిరోజుల‌పాటు కాంగ్రెస్‌లో అదే చ‌ర్చ జరిగింది. దీంతో, చిదంబ‌రం కూడా త‌న కొడుకు రాజ‌కీయ భ‌విష్యత్తు సెటిల్ చేయాల‌నే ఆలోచించారే త‌ప్ప‌, పార్టీకి అవ‌స‌ర‌మైన సేవ‌లు చేయ‌లేద‌నేది రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌గా తెలుస్తోంది.

మొత్తంగా, ఈ ముగ్గురు సీనియ‌ర్లు పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషించ‌లేద‌నీ, కేవ‌లం వారి స్వార్థాన్ని చూసుకున్నార‌ని రాహుల్ గాంధీ కోపంగా ఉన్నట్టు స‌మాచారం. ఈరోజు పార్టీకి ఈ ప‌రిస్థితి రావడానికి కార‌ణం సీనియ‌ర్ల వైఖ‌రే అనేది ఆయ‌న అభిప్రాయంగా తెలుస్తోంది. క‌మ‌ల‌నాథ్, అశోక్ గెహ్లాట్, చిదంబ‌రం… ఈ ముగ్గురూ ఇప్పుడు ఎలా స్పందిస్తార‌నేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు – సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మట్టి కరిచింది. అయితే గడచిన ఎన్నికల్లో కంటే ఓ 8 సీట్లను అధికంగా గెలిచింది. అయినా కూడా కేవలం పార్టీ గెలవలేదన్న కారణాన్ని చూపి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ… పార్టీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఓటమికి తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్న రాహుల్ ప్రకటన కాంగ్రెస్ లో పెను కలకలమే రేపిందని చెప్పక తప్పదు. ఎందుకంటే. సోనియా, ప్రియాంక, వాధ్రా వద్దని వారించిన రాహుల్‌ మొండికేశారు. అటు సీనియర్లు రాహుల్‌ను బుజ్జగిస్తున్నారు.
పార్టీ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలని, పార్టీని ముందుకు మీరే నడిపించాలని కష్టకాలంలో పార్టీ పదవిని వదిలితే ఎలా… ఇలా వచ్చిన ప్రతి నేత కూడా రాహుల్ కు తమదైన శైలిలో బుజ్జగించారు. దీనికి రాహుల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *