రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ లేదా..!?

రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ లేదా..!?

ప్రధాని పదవి ఆయనకు ఓ కల. తన కుమారుడు ప్రధాని కావాలని ఆ తల్లికి ఓ ఆశ. తన తమ్ముడ్ని ప్రధానిగా చూడాలని ఓ అక్క తాపత్రయం. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి. భారత తొలి ప్రధానమంత్రికి మునిమనవడిగా…. ఓ మాజీ ప్రధాని కి మనవడిగా… ఇంకో మాజీ ప్రధానికి కుమారుడిగా వారసత్వ లక్షణాలు కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికల్లో వారి కలలూ, ఆశలూ, ఆకాంక్షలూ నెరవేరుతాయని నిన్న మొన్నటి వరకూ ఆ కుటుంబం నమ్మకంగా ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. జాతీయ మీడియాతో పాటు వివిధ ప్రైవేటు సంస్థలు నిర్వహించిన సర్వేలు… ఎన్డీఏకు అపూర్వ విజయం వస్తుందని తేల్చి చెప్పాయి. ఈ సర్వే ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచినా లోలోపల మాత్రం వారిని ఓ భయం వెంటాడుతోంది అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కడుతున్న కూటమిలో సీనియర్ నాయకులు ప్రధానిగా రాహుల్ గాంధీని అంగీకరించే పరిస్థితి లేదని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి స్వయంగా 150 నుంచి 200 స్థానాలు వరకు వస్తే విపక్షాలు తమ మాట వింటాయనీ, అలా కాని పక్షంలో తామే వారి మాట వినాల్సి వస్తుందనీ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ పార్టీకి తగినన్ని స్థానాలు రాకపోతే ప్రధాని పదవిని డిమాండ్ చేసే అవకాశమూ ఉండదని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ తమ రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ప్రధాని పదవి తమకే కావాలని మమతా బెనర్జీ, మాయావతి వంటి వారు డిమాండ్ చేసే అవకాశమూ ఉందంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కి స్వయంగా 150 స్థానాల నుంచి 200 వరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. అలా జరగని పక్షంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా తక్కువేనని అంచనా వేస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికీ తెలుసనీ, భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు ప్రధానమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ తమ అధిష్టానం ప్రకటించిందనీ వారు చెబుతున్నారు. ఇదే జరిగితే మరో ఐదేళ్ళ పాటు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవికి దూరంగా ఉండాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *