ఓడిపోయినా అమేథీని వదలని రాహుల్

ఓడిపోయినా అమేథీని వదలని రాహుల్

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత రాహుల్ వైఖరి మారిపోయింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్, పార్టీలో సభ్యుడిగా కొనసాగాలని డిసైడ్ అయ్యారు. పార్టీ పగ్గాలు వదిలేశాక ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు ఓకే అంటూ రాహుల్ సంకేతాలు పంపుతున్నారు. కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతున్న ఈ తరుణంలో, రాహుల్ గాందీ అమేథీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నికల తర్వాత, తొలిసారి రాహుల్ అమేథీలో పర్యటించబోతున్నారు.

గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న అమెథీలో ఈసారి బీటలు వారింది. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ కు అమేథీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. వరుసగా మూడు దఫాలు రాహుల్ ను ఆశీర్వదించిన అమేథీ ప్రజలు, ఈసారి పక్కనబెట్టారు. స్మృతీ ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. అమేథీ ప్రజలు ఝలక్ ఇచ్చినా – వయనాడ్‌లో భారీ మెజారిటీతో నెగ్గడం ద్వారా రాహుల్ గాంధీ పరువు నిలుపుకున్నారు. అమేథీలో ఓడిపోయినా, ఆ నియోజకవర్గంపై ఉన్న అటాచ్‌మెంట్‌ను మాత్రం రాహుల్ వదులుకోలేకపోతున్నారట. నియోజకవర్గంలో రాహుల్ పర్యటనకు పార్టీ ఏర్పాట్లు కూడా చేసిందట.

2017లో కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టారు. అయితే రెండేళ్లు కూడా ఆయన ఆ హోదాలో ఉండలేకపోయారు. ఎన్నికల్లో పార్టీ చిత్తయిపోవడంతో రాహుల్ ప్రెసిడెంట్‌ పదవిని వదిలేశారు. కుటుంబసభ్యులు వారించినా, నేతలు ప్రాధేయపడినా-ఆఖరుకు రాజీనామాలు సంధించినా రాహుల్ మాత్రం మెత్తబడడం లేదు. అధ్యక్ష పదవి విషయంలో కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం… త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందేమోనని పార్టీ నేతలు కంగారుపడుతున్నారు. ఈనేపథ్యంలో పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారట. రాహుల్ వదిలేసిన పదవిని ప్రియాంకనే భర్తీ చేయాలని కోరుతున్నారట.

సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక, యూపీలో ఆ పార్టీ తరపున కీలక బాధ్యతలు చేపట్టారు. కానీ, రాష్ట్రంలో మరోసారి బీజేపీ హవానే కొనసాగింది. ప్రియాంక ఎత్తుగడలు ఏవీ ఫలించలేదు. దేశమంతటా కాంగ్రెస్ ఘోర ఓటమిలో ప్రియాంక కూడా ఓ విధంగా బాధ్యులయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రియాంక పార్టీ బాధ్యతలు తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక, ఇప్పుడు సంక్షోభంలో పార్టీ పగ్గాలు చేపట్టే సాహసం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *