హాంకాంగ్‌లో అదుపు తప్పిన ఆందోళనలు!

హాంకాంగ్‌లో అదుపు తప్పిన ఆందోళనలు!

ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఒక దేశం అట్టడుకుతుంది. ప్రజలు నినదిస్తే ఒక దేశం గడగడలాడుతుంది. ప్రజలు తెగించి ముందడుగు వేస్తే ఒక దేశమే తలొగ్గి చూస్తుంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో అచ్చు ఇదే పరిస్థితి కనబడుతోంది. ప్రజల తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందంటే పార్లమెంటుని సైతం ఆక్రమించి తమ స్వేచ్ఛను హరించే నిర్ణయాలను అమలు కానివ్వమని గర్జిస్తున్నారు. అసలు ప్రజలు ఇంతగా తిరగబడ్డానికి కారణం ఏమిటో తెలుసుకుందాం!

హామీలు తప్పారంటూ ప్రజాగ్రహం!

1997లో జరిగిన ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌లో ‘ఒక దేశం-రెండు వ్యవస్థలూ అనే విధానం అమలు జరిగింది. అంటే హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అప్పటి ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్‌పై చైనాకు ఎలాంటి అధికారం ఉండదు. కానీ అప్పటిదాకా ఆగలేని చైనా ప్రభుత్వం ముందుగానే హాంకాంగ్‌ను అధీనంలోకి తీసుకునే దిశగా అడుగులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా హాంకాంగ్ స్థానిక ప్రభుత్వం నేరస్థుల అప్పగింత చట్టం అమలుకి అనుకూలంగా ఉంది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం…నిందితులను విచారించేందుకు ఎటువంటి కోర్ట్ అనుమతి లేకుండా చైనాకు తీసుకుని వెళ్లవచ్చు. ఈ వ్యవహారం గురించే దేశమంతటా తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. ఈ చట్టం వల్ల తమ స్వేచ్ఛను కోల్పోతామని, చట్టాన్ని అడ్డం పెట్టుకుని చైనా కమ్యునిస్టు నాయకులు తమను తీసుకెళ్లి చిత్రహింసలు పెడతారని భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. చైనాలో హాంకాంగ్‌ను విలీనం చేసే సమయంలో ఇచ్చినటువంటి స్వయంప్రతిపత్తి హామీని పట్టించుకోవట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

భవనంలో చొరబడి…

ఈ నిరసనలు, ఆందోళనలు గత కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. ఇన్నిరోజులు శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శనలు సోమవారంతో తీవ్ర రూపంలోకి మారాయి. వేల సంఖ్యలో ఆందోళన కారులు పార్లమెంటు భవనాన్ని దిగ్భందించారు. బారికేడ్లను సైతం విరగ్గొట్టుకుని లోనికి ప్రవేశించారు. ఆ ప్రదేశంలో ఉన్న గోడలపై పెయింటుతో నినాదాలను రాశారు. ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేక జాతీయ చిహ్నాన్ని పెయింట్‌ని జల్లి చెరిపారు. అద్దాలనూ, ఫర్నిచర్‌నూ బద్దలు చేశారు. రాత్రి దాకా సాగిన ఈ తీవ్ర ఆందోళన రాత్రి సమయంలో వచ్చిన తుది హెచ్చరికలతో కొంచెం తగ్గుముఖం పట్టాయి. కొందరు భవనంలోపలే ఉండి చైనా వ్యతిరేక, బ్రిటన్ అనుకూల నినాదాలు చేయడం జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి చైనా పోలీసులు బాష్పవాయువులను ప్రయోగించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలుముకుంది. హాంకాంగ్‌లో పరిస్థితి అదుపు తప్పిందని అంతర్జాతీయంగా వార్తలు కూడా వెలువడ్డాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *