నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు

నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులు

సీజన్ వచ్చిందంటే వానలు పడటమైనా ఆలస్యమవుతుందేమో కానీ.. నకిలీ విత్తనాలు మాత్రం మార్కెట్ ను ముంచెత్తుతాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా నకిలీ విత్తనాలు గ్రామగ్రామానికి చేరుకుంటున్నాయి. మొలకెత్తే దాకా విత్తనం నకిలీదో,అసలైనదో తెలీక రైతులు నట్టేట మునుగుతున్నారు.

వానా కాలం ఎంటరై నెల కావస్తోంది. ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు.. అడపాదడపా వచ్చిన వర్షానికే మురిసిపోయిన అన్నదాతలు ఉన్న కొద్ది పొలాన్ని దుక్కి చేసుకుని విత్తటానికి సిద్ధమై పోయాడు.. కార్తె దాటితే విత్తినా లాభం లేదనుకుని ఆదరాబాదరా అంగట్లో దొరికిన విత్తనాలు అప్పో సప్పో చేసి కొనుక్కుపోతున్నాడు.. తిన్నా తినకపోయినా.. పంట చేతికొస్తే చాలన్న భరోసాతో అయిన చోటల్లా అప్పులు చేస్తున్నాడు.. పంట ఎండిపోకుండా ఉండేందుకు ఆరుగాలం కష్టపడుతున్నాడు.. విత్తు మొలకెత్తినప్పటినుంచి చీడపీడలంటకుండా చూసుకుంటున్నాడు.. ఇందుకోసం కూడా ఖర్చుకు వెనుకాడకుండా పురుగు మందులు కొంటున్నాడు.

అన్నీ సజావుగా చేసినా.. మొక్క ఎదుగుదల కనిపించక దిగాలు పడుతున్నాడు.. ఒకటో అర మొలెకెత్తినా.. కాపు సరిగా లేక దగా పడుతున్నాడు.. అప్పటికి కానీ అసలు విషయం బోధ పడక లబోదిబో మంటున్నాడు.. తాను కొన్నది నకిలీ విత్తనాలని తేలిపోవడంతో ఏం చేయాలో దిక్కు తెలీక ఛస్తున్నాడు.. ఓ వైపు కొండలా పెరిగిన అప్పు.. మరో వైపు ఫలసాయం దక్కని వ్యవసాయంతో అల్లాడుతున్నాడు. పండిన కొద్ది పంటనైనా మార్కెట్ కు తరలిస్తే దళారీల దందాతో బెంబేలెత్తుతున్నాడు.

వాణిజ్య పంటల సంగతి పక్కన పెడితే.. కూరగాయలైనా పండించుకుందామనుకున్నా కుదరడం లేదు.. పాలకూర,చుక్కకూర, తోటకూర, దొండ,బెండ లాంటి వాటిలో కూడా నకిలీ విత్తనాలు వచ్చేశాయి. వ్యాపారి తన లాభం కోసం వీటిని అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు.. ఆకు కూరలకు మార్కెట్లో మంచి ధరే పలుకుతున్నా.. పంట దిగుబడి లేక రైతు అల్లాడుతున్నాడు.

నకిలీ విత్తనాల సమస్య ఈ రోజుదేం కాదు.. ఎంతో కాలంగా అమాయక రైతులను విత్తన వ్యాపారులు నిండా ముంచుతూ వస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా వ్యవసాయాధికారుల నుంచి ఆశించిన చేయూత అందడం లేదు.. ప్రభుత్వ చర్యలతో న్యాయం దక్కడం లేదు.. ఎవరికి చెప్పుకోవాలో తెలీక.. ఏం చేయాలో అర్థం కాక.. చివరకు అన్నదాత అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.

వానలు రాక.. పంటలు పండక ఓ వైపు.. పండిన కొద్ది పాటి పంటను కోల్డ్ స్టోరేజ్ లు లేక కాపాడుకోలేక మరో వైపు అన్నదాత నష్ట పోతూనే ఉన్నాడు.. గిట్టుబాటు ధర వచ్చేదాక పంటను రక్షించుకునే వ్యవస్థే లేదు.. ఏటా రైతుల కోసం ఎన్నో కోట్ల సబ్సిడీలు, రాయితీలు, బడ్జెట్లో కేటాయింపులు చేపడుతున్న ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలో ఎందుకంత పట్టనట్టు ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు.. ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. నాణ్యమైన విత్తనాలు మాత్రం అందించలేకపోతున్నారని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వ విధానాలు, చట్టాలు అన్నీ భూమిని వ్యవసాయ యోగ్యం చేసే రైతుకు వ్యతిరేకంగా ఉండటం దురదృష్టకరం. 1966 విత్తన చట్టం పరిధిలో జరిగిన శాస్త్రపరిశోధనల ఆధారంగా, ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సుల పుణ్యమా అని నకిలీ విత్తనాలు వచ్చాయి. ఈ నకిలీ విత్తనాలతో పాటు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు కోట్లాది మంది రైతులకు శాపంగా మారాయి.

నకిలీ విత్తనాలు సరఫరా చేసి, రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు కంపెనీలకు రాజకీయ నేతల అండదండలు ఉంటున్నాయి. అలాంటి కంపెనీలపై రైతులు కేసు పెట్టే ధైర్యం ఎలా చేస్తాడు? నాసిరకం విత్తనాలు మొలవక, మొలిచినా దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ఏకమై సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దక్కదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *