కాంగ్రెస్‌ కలలను ప్రియాంక సాకారం చేస్తారా?

కాంగ్రెస్‌ కలలను ప్రియాంక సాకారం చేస్తారా?

తూర్పు ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. యూపీలో కాంగ్రెస్‌ పునర్‌వైభవానికి ఆమెను బ్రహ్మాస్త్రంగా భావిస్తోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మరి కాంగ్రెస్‌ ఆశలను ఆమె నిలబెడతారా? ఆమె కరిష్మా పనిచేస్తుందా?

యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక తూర్పు యూపీ విషయానికి వస్తే 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి సవాల్‌ విసురుతుండడం… ప్రియాంకకు అగ్నిపరీక్షగా మారింది. 1951 నుంచీ కేంద్రంలో అధికారం దక్కాలంటే తూర్పు యూపీయే కీలకమవుతోంది. 2014 ఎన్నికల్లో అమిత్‌ షా రాజకీయ వ్యూహం ఫలించి… 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి కూడా అదే పట్టు కొనసాగించాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ కూటమి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ గట్టి పునాదులు ఉన్న ఈ ప్రాంతంలో….. కాంగ్రెస్‌ 1996, 1998, 1999 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2004లో రెండు, 2009లో మూడు సీట్లు మాత్రమే దక్కించుకుంది.

పూర్వాంచల్‌లో 1991 నుంచి బీజేపీ పట్టు నిలుపుకుంటోంది. తర్వాత స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ ఉన్నాయి. ఈ పార్టీలకు దక్కే ఓట్ల శాతం దగ్గర దగ్గరగా ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి బరిలో నిలవడంతో ఆ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో ఎస్పీకి ఒకే స్థానం లభించింది. బీఎస్పీకి ఒక్కటీ దక్కలేదు.

1971 వరకు ప్రాబల్యాన్ని కొనసాగించిన కాంగ్రెస్‌ ఆ తర్వాత డీలా పడింది. గత ఐదారు ఎన్నికల్లో ఆ పార్టీ 15 శాతానికి మించి ఓట్లు సాధించలేదు. పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు. ప్రియాంక కట్టు బొట్టు నానమ్మ ఇందిరాలా ఉండటం తమకు మరింత కలిసి వచ్చే అంశంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణసీ, యోగి అడ్డా అయిన గోరఖ్‌పూర్‌, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న ఆజంగఢ్‌, సోనియా, రాహుల్‌ గాంధీల పెట్టనికోటలైన రాయ్‌బరేలీ, అమేథీ తూర్పు యూపీలోనే ఉన్నాయి. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న వారంతా తూర్పు యూపీలోనే పోటీ చేస్తున్నారు. మరి అత్యంత కీలకమైన తూర్పు యూపీలో ప్రియాంక కరిష్మా ఎంతవరకు పనిచేస్తుందో తేలాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *