పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు? కొరడాతో ఏం చేస్తారు?

పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు? కొరడాతో ఏం చేస్తారు?

MojoTv Special: పోతురాజు – బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు? కొరడాతో ఏం చేస్తారు?

బోనాల పండుగలో ఒళ్లంతా పసుపు పూసుకుని చేతిలో కొరడా పట్టకుని.. బోనం వెంట నడుస్తూ చిత్ర విన్యాసాలు చేసే పోతురాజు అంటే అందరికీ ఆసక్తి – భయం – ఉత్సాహం. ఇంతకీ ఎవరీ పోతురాజులు? ఎందుకు వారీ వేషం వేస్తారు? పోతురాజులు ఎలా తయారవుతారు? పోతురాజు అవ్వాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?

గోల్కొండ కోటపై ఉన్న ఎల్లమ్మ (జగదాంబ మహంకాళి) గుడి దగ్గర పోతురాజు వేషం వేసిన జంగ్ శివ, వెర్రోజు రామాచారిలతో బీబీసీ మాట్లాడింది. షేక్ పేట నాలా దగ్గర ఉండే 25 ఏళ్ల శివ దాదాపు తొమ్మిదేళ్ల నుంచి ఈ వేషం వేస్తున్నట్టు చెప్పారు. తన కుటుంబంలో ఎవరూ పోతురాజులు లేకపోయినప్పటికీ ఆసక్తితో ఈ వేషం వేయడం మొదలుపెట్టారు.

పోతురాజు గ్రామదేవతకు సోదరుడని స్థానికుల నమ్మకం. పోతురాజుకు సంబంధించిన పద్దతులు గ్రామాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. సాధారణంగా అమ్మవారి గుడి బయట పోతురాజు విగ్రహం పెడుతుంటారు. హైదరాబాద్ నగరంలో పోతురాజు సంస్కృతి సజీవంగా ఉండడంతో పాటూ, పెరుగుతూ, కొత్త కొత్తగా మారుతోంది.

“గోల్కొండలో చాలా మంది పోతురాజులను చూసే వాడిని. మా తాతల కాలం నుంచీ గోల్కొండ అమ్మవారిని తీసుకువస్తాం. నేను కూడా అమ్మవారిని తీసుకు వస్తా అని ఇంట్లో అడిగాను. కానీ చిన్నాపిల్లాడినని వద్దన్నారు. అప్పుడు పోతురాజు వేషం వేస్తాను అని ఇంట్లో అడిగాను. మా అమ్మ ఒకరోజు ఏమీ చెప్పలేదు. తరువాత, నీకు ఎవరు ఉంటారు? ఏమైనా జరిగితే ఎవరు చూస్తారు అని ప్రశ్నించారు. నేను చూసుకుంటానని మా గురువు జన్నె పరమేశం గారు చెప్పారు. మా వాళ్లు గుడిలో మాట్లాడి అవకాశం ఇప్పించారు. ఒకసారి లంగర్‌ హౌజ్‌లో వేశా. నాకు చాలా మంచిగ అనిపించింది. చాలా మంచి జరిగింది.” అంటూ తాను ఎలా పోతురాజుగా మారిందీ చెప్పుకొచ్చారు శివ.

 

“మొదటిసారి వేషం వేసినప్పుడు అంతా అయోమయంగా ఉండేది. అందరూ స్టెప్పులు వేస్తున్నారు. నేను కొత్తగా వచ్చానని ముందుకు తోశారు. నేను బాగా సిగ్గుపడ్డాను. రెండోసారి నుంచి సిగ్గు వదిలేసి కొనసాగించాను. మొదటిసారి బట్టలు విప్పడం, షార్ట్ వేసుకోవడం సిగ్గు అనిపించింది. ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు వస్తే దాచుకునే వాడిని. రెండోసారి నుంచి భక్తి పెరిగింది. వాళ్ల మధ్య సిగ్గుపడకుండా పోతురాజు వేషం మొదలుపెట్టా.” అని శివ వివరించారు.

శివ ఒక సంస్థలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. బోనాలు జరిగే ఆషాఢ మాసం మొత్తం సెలవు పెట్టేసి పోతురాజుగా ఉంటారు. మిగిలిన ఏడాది అంతా డ్రైవింగ్ పనే. తమ ప్రాంతంలో లేదా తమ కుటుంబం చేసే ఉత్సవంలో పోతురాజు ఉండాలనుకున్న వాళ్లు పోతురాజులను ముందుగా సంప్రదించి, డబ్బు, తేదీలు మాట్లాడుకుని బుక్ చేసుకుంటారు.

42 ఏళ్ల వెర్రోజు రామాచారి 12 ఏళ్లుగా ఈ వేషం వేస్తున్నారు. ఈయన వండ్రంగి పనిచేస్తూ, ఆషాఢంలో మాత్రం ఆసక్తి కొద్దీ పోతురాజు వేషం వేస్తున్నారు.

“ఇష్టంతో వేషం వేస్తున్న. మంచిగ అనిపించింది. దీనికి వంశం, కులం ఏముండదు. కొందరికి ఈ వేషం కలిసొస్తుంది. కొందరికి కలిసిరాదు. మాకు కలిసొచ్చింది, వేస్తున్నాం. ఫస్ట్ టైమ్ అంటే.. ఫ్రెండ్స్ వెంబడి తిరిగేవాడిని. వాళ్లు వేసేవాళ్లు. వాళ్లతో పాటూ వేయాలని ఇంట్రెస్టొచ్చింది. వేశాను. అప్పటి నుంచీ నాకు కలిసొచ్చింది” అని చెప్పారు రామాచారి.

 

ఉపవాసం:

పోతురాజు వేషం వేసే రోజు శివ ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రిని తమ ఇంట్లో వేసిన పటం దగ్గర ఉంచి పూజ చేసి ఆ సామాగ్రితో వేషం వేయాల్సిన గుడి లేదా ఇంటికి వెళ్లి అక్కడ అలంకరించుకుంటారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి వేషం తీసేసిన తరువాత మాత్రమే భోజనం చేస్తారు. మధ్యలో పళ్లరసాలు, గ్లూకోజ్ లేదా మంచినీళ్లు మాత్రం తాగుతారు.

“అందరూ ఉపవాసం ఉండరు. కొందరు మాత్రమే చేస్తారు. ఇంకొందరు మందు తాగుతారు. ఉపవాసం ఉంటే మంచిది. చూసేవాళ్లకు మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒక్కపొద్దు ఉండి భక్తితో వేషం వేశారు. భక్తితో కోల మన మెడలో వేశాడు అని అభిప్రాయం ఉంటుంది. కానీ చాలా మంది చేయరు. పోతురాజు గురించి ప్రాక్టికల్‌గా తెలిసిన వాళ్లే చేస్తారు” అంటూ తన పద్ధతి చెప్పుకొచ్చారు శివ.

“నేను ఏదైనా శాకాహారం తీసుకుని వేషం వేస్తా. వేషం వేసాక ఏమీ తినను. శక్తి కోసం మంచినీళ్లు, గ్లూకోజ్‌ తాగుతాను. సామాను, పసుపు దింపే వరకూ (వేషం తీసేసే వరకూ) మందు తీసుకోం. కొందరు ముందుగానే మందు తాగి తరువాత వేస్తారు. మేం అలా కాదు. స్నానం చేసిన తరువాతే. కొందరు వేషంలోనే తాగుతారు. ఎవరి ఇష్టం వారిది. మాకిలా మంచిగుంది. అమ్మవారు దారి చూపిస్తోంది.” అన్నారు రామాచారి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *