ఖమ్మంలో గేర్ మార్చిన కారు

ఖమ్మంలో గేర్ మార్చిన కారు

17వ లోక్ సభ ఎన్నికలకు పోల్ సైరన్ మోగిన వేళ… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ విషయంలో అధికార పార్టీ మళ్లగుల్లాలు పడుతుంది. ఎంపీ పొంగులేటి విషయంలో గుర్రుగా ఉన్న అధిష్ఠానం ఆయన్ను పక్కనబెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా బరిలో దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి…టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లారు. పారిశ్రామికవేత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పొంగులేటి, టీఆర్ఎస్ లో చేరాక బడా పారిశ్రామిక వేత్తగా ఎదగడంతో పాటు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక కోటరిని ఏర్పాటు చేసుకున్నారు. ఐతే, ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బొక్కాబోర్లా పడడంతో.. ఓటమి పాలైన నేతలంతా పొంగులేటివైపే వేలెత్తి చూపారు. ముందస్తు ఎన్నికల్లో పొంగులేటి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్ధులను కాకుండా…. రెబల్, ప్రతిపక్ష అభ్యర్దులకు పరోక్షంగా, ఆర్థిక సాయం అందించారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.

మొదటి నుంచి ఎంపీ సీట్ల విషయంలో సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం ఇస్తానన్న కేసీఆర్, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నో చెప్పారట. కొద్ది రోజులుగా కేసీఆర్, పొంగులేటికి అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడంలేదట. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి పొంగులేటి పావులు కదిపారని అధినేత గుర్రుగా ఉన్నారట. ఎంపీగా పోటీచేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన పొంగులేటికి అధినేత పెద్ద షాక్ ఇవ్వడంతో సందిగ్ధంలో పడిపోయారట. గులాబీ దళపతి పొంగులేటికి నో చెప్పారని తెలవడంతో…జిల్లాకు చెందిన కీలక నేతలు ఓ ప్రముఖ వ్యాపారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కు పరిచయం చేశారట. వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కు టికెట్ ఇచ్చేందుకు అన్ని చర్యలు పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, పొంగులేటి వైసీపీ నేతల ద్వారా కేటీఆర్, కేసీఆర్ ల దగ్గరకు ఓ కీలకవ్యక్తితో రాయబారాలు మొదలుపెట్టారట. ఖమ్మం కాకుండా నల్లగొండ నుంచి ట్రై చేద్దామని ఆ కీలక వ్యక్తి రాయబారం తీసుకొచ్చినట్లు సమాచారం. ఐతే, వేరే జిల్లా నుండి పోటీ చేసేందుకు పొంగులేటి ఇష్టపడడం లేదట.

ఖమ్మం టీఆర్ఎస్‌లో కీలక నేతగా మారిన పొంగులేటికి ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత రావడంతో, ఆయన కొంత మనస్థాపానికి గురైనట్టు ఎంపీ వర్గం చెబుతోంది. ఎంపీ సీటు విషయంలో తాము చెప్పిన వ్యక్తికే టికేట్ వచ్చేలా, కారు స్టీరింగ్ తిప్పాలని జిల్లాలోని నేతలు భావిస్తున్నారట. దీంతో ఖమ్మం ఎంపీ సీటు విషయంలో మా కారుకు ‘ఢ్రైవర్ రాముడు’న్నాడుగా అని వ్యాఖ్యానించుకుంటున్నారట నేతలు. ఏదేమైనా నామినేషన్లకు కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండడంతో ఈ లోపు ఎంపీ పరిస్థితిని చక్కబెట్టుకుని అభ్యర్థిగా వస్తారా? లేక పార్టీ బలపరిచిన వ్యక్తికే మద్దతిస్తారా..?ఇవేవి కాకపోతే వేరే పార్టీ నుండి పోటీ చేస్తారా..? లేక ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారా..?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది రెండ్రోజుల్లో తేలిపోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *