మూగబోయిన రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లు

మూగబోయిన రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లు

ఎటు చూసినా కోలాహలం.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు.. ఎత్తులను చిత్తు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టింగ్‌లు.. ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి ఇది. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐటీ సెంటర్లు మూగబోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఖర్చుకు భయపడి చాలా పార్టీలు సిబ్బందికి ఉద్వాసన పలుకుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

సోషల్‌ మీడియా ప్రచారం, అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఐటీ సెంటర్లను అట్టహాసంగా ప్రారంభించాయి. స్థాయి, పనితనం ఆధారంగా సిబ్బందికి భారీగా వేతనాలు ఇచ్చాయి. అయితే, ఎన్నికలు ముగియడంతో ఐటీ సెంటర్లలోని సిబ్బందికి అన్ని పార్టీలు ఉద్వాసన పలుకుతున్నాయి. సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అర్ధంతరంగా పని కోల్పోయిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

జనసేన పార్టీ ఐటీ సెంటర్‌ కోసం రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతుస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దాదాపు 500పైచిలుకు మందిని నియమించుకున్నారు. ఎన్నికలు ముగిసి వారం కూడా గడవకముందే ఐటీ సెంటర్‌లోని మెజార్టీ సిబ్బందికి ఉద్వాసన పలికారు. దాదాపు 350 మందిని విధుల్లోంచి తొలగించారు. మూడంతస్థుల భవనంలో ఒక అంతస్థు మాత్రమే ఉంచుకుని మిగతా రెండింటిని జనసేన ఖాళీ చేయడంతో టు-లెట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో 100-150 మంది ఉద్యోగులతోనే ఐటీ సెంటర్‌ నిర్వహించాలని భావిస్తున్నామని, మళ్లీ ఎన్నికల వరకూ ఈ సెంటర్‌తో అంతగా పని ఉండబోదని జనసేన నేత ఒకరు తెలిపారు.

వైసీపీకి చెందిన ఐటీ సెంటర్‌లో అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ సమీపంలో ఉన్న ఐటీ సెంటర్‌ ద్వారా పార్టీ ప్రచారం కోసం పలు యూట్యూబ్‌ చానళ్లు సైతం నిర్వహించారు. వీటిని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించారు. ఇందుకోసం టెలీకాలర్లు, కంటెంట్‌ రైటర్లు, ఫొటోషాప్‌ డిజైనర్లను అధిక సంఖ్యలో నియమించుకున్నారు. పార్టీ వార్తలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్లకు… ఎన్నికలు ముగియడంతోనే చేదు వార్త అందింది. ఇక, విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పేశారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యేకంగా ఐటీ సెంటర్‌ లేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం పలువురు అభ్యర్థులు వివిధ ఏజెన్సీల తరఫున టెలీకాలర్లను నియమించుకున్నారు. ఇందుకోసం ఆయా ఏజెన్సీలు టెలీకాలర్లు, ఫొటోషాప్‌ డిజైనర్లను నియమించుకున్నాయి. ఎన్నికలు ముగియడంతో ఆయా ఏజెన్సీలు కొందరిని తొలగించి, మిగిలిన వాళ్లను ఇతర పనుల కోసం ఉపయోగించుకుంటున్నాయి.

మరోవైపు – ఎలక్షన్స్‌ కోసం టీడీపీ నాలుగు సెంటర్లు పెట్టింది. మంగళగిరి, విజయవాడ, తాడేపల్లిలో వాటిని ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు స్టేట్‌ ఆఫీస్‌లో ఐటీ సెంటర్‌ కొనసాగుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *