ఏపీలో సిద్ధమవుతున్న "గోపి" లు..!!?

ఏపీలో సిద్ధమవుతున్న "గోపి" లు..!!?

గోపి. ఓ మంచి పేరు. రాజకీయాలలో మాత్రం పార్టీలు మారే నాయకులకు ప్రజలు ప్రేమతో ఇచ్చే బిరుదు. ఎన్నికల్లో అభిమానించిన పార్టీకి ఓటు వేసిన ప్రజలను మోసగించి అధికారంలో ఉన్న పార్టీలోకి మారే వారిని గోపి అని పిలుస్తున్నారు. ఇంతకీ గోపి అంటే తెలుసుగా…!? గోడ మీద పిల్లి. తమకు ఎటు అనుకూలంగా ఉంటే అటే దూకేస్తుంది గోడ మీద పిల్లి. భారత రాజకీయాలలో… ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఈ గోపి ల సంఖ్య ఎక్కువవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మంది శాసనసభ్యుల్లో పది మందికి పైగా గోపీలుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మూడు నెలలు కాకముందే వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వీరి చేరికతో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. అయితే తెలంగాణ ప్రజల్లో మాత్రం ఈ కాంగ్రెస్ గోపిల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఈ గోపిలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ గోపిల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నువ్వానేనా అన్న స్థాయిలో జరగడంతో గోపీలకు ప్రాధాన్యత ఎక్కువైంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాల అనంతరం గోపిలుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంత కీలకంగా మారిందో, ప్రతి ఎమ్మెల్యే అంతకంటే ఎక్కువ కీలకంగా మారుతున్నారు. రాజకీయ లెక్కలలో భాగంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అధికార పీఠానికి చేరువలో వచ్చిన వారికి కొందరు ఎమ్మెల్యేల గోడ చేర్పు అవసరం అవుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచే ప్రతి ఒక్కరూ ఈ నెల 23 తర్వాత అత్యంత కీలకంగా మారనున్నారు. వారు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో గోడ మీద పిల్లులు రూపం దాల్చేందుకు చాలా మంది ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన అభ్యర్థులు మరో పార్టీకి తమ మద్దతు ప్రకటించడం ఎన్నికల నిబంధనల రీత్యా ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికి జంప్ చేసే జిలానీలు… అదే గోపీలు ఎక్కువగానే ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *