మబ్బుల మాటున"మోడీ"...మాటల చాటున "మాయ"

మబ్బుల మాటున"మోడీ"...మాటల చాటున "మాయ"

ఇదేమిటీ… ఆకాశం మేఘావృతమై ఉంది అని కదా చెప్పాలి. ఇలా మోడీవృతమై ఉందని చెప్తున్నారనుకుంటున్నారా… ఏం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేస్తున్న ప్రకటనలు ఇలాగే ఉంటున్నాయి. వీటి ప్రభావంతో లోక్‌సభ ఎన్నికల విశేషాలు చరిత్రకెక్కేలా కనిపిస్తున్నాయి. చిన్నాచితకా నేతలు ఏదో మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ప్రధాని స్థాయి నేతలే విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తుంటే జనం విస్తుపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. మేఘాల చాటునుంచీ చేస్తే యుద్ధ విమానాలు రాడార్లకు చిక్కవని తాను బాలాకోట్ దాడుల సమయంలో వైమానిక దళానికి సూచించానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం జనాలకు నవ్వు తెప్పిస్తోందని అంటున్నారు. ప్రధాని మాటలతోనే దాడుల సీరియస్ ఏమిటో తెలిసిపోతోందనీ అంటున్నారు. ముందూ, వెనుకా ఆలోచించకుండా ఉన్నత స్థాయి నేతలు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. అయినా వారు మాత్రం తమ వ్యవహార శైలిని మార్చుకోవడం లేదని చెబుతున్నారు. ఇటు మాయావతీ ప్రధాని మోడీ మీద అనుచిత వ్యాఖ్యలే చేశారు. ఆయన భార్యను వదిలి ఉంటున్నారు కాబట్టి ఎవరైనా పురుషులు మోడీతో మాట్లాడితే వారూ అలాగే మారిపోతారేమోనని మాయావతి వ్యాఖ్యానించారు. కుదిరితే ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటున్న నాయకురాలు ఇలా మాట్లాడడం వాంఛనీయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ నాయకురాలు మేనకా గాంధీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేయకపోతే ముస్లింలకు ఉద్యోగావకాశాలు ఉండవనీ, ఉపాధి దొరకదనీ ఆమె హెచ్చరించారు. దీని మీద ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అంతకు ముందు యూపీ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ జయప్రదను అనరాని మాటలు అన్నాడు. జయప్రద ఆర్ఎస్ఎస్ నిక్కరు వేసుకున్న సంగతి తనకు ఏనాడో తెలుసని వ్యాఖ్యానించి ఈసీ ఆగ్రహానికి గురయ్యాడు. నరేంద్ర మోడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు ’చౌకీదార్ చోర్ హై‘ అన్నదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చివరకు సుప్రీం కోర్టు కన్నెర్ర చేయడంతో బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఇలా ఈసారి ఎన్నికల ప్రచారంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం ఎంతో హుందాగా ఉండేదనీ, రాజకీయ పార్టీల నేతలు సిద్ధాంతాల ప్రాతిపదికనే ఆచితూచి విమర్శలు చేసుకునేవారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటి ఎన్నికల ప్రచారం పూర్తిగా అదుపు తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *