కోట్లలో పట్టుబడుతున్న నోట్లకట్టలు...ప్రలోభాలకు దిగుతున్న పార్టీలు

కోట్లలో పట్టుబడుతున్న నోట్లకట్టలు...ప్రలోభాలకు దిగుతున్న పార్టీలు

ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్న నేపథ్యంలో నోట్లకట్టలు భారీగా పట్టబుడుతున్నాయి.మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఓట్ల కోసం పార్టీలు భారీ ప్రలోభాలకు దిగుతున్నాయి.చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి.ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.వేలకు వేలు పంచుతూ..ఓట్లను కొనేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో తనిఖీల్లో రోజుకో చోట ఏకంగా కోట్లకు కోట్లే పట్టుబడుతున్నాయి.

హైదరాబాద్‌ నారాయణగూడ ఫ్లై ఓవర్‌పై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీల్లో 8 కోట్ల నగదు పట్టుబడటం సంచలనం సృష్టించింది.ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా..ఈ డబ్బును బీజేపీకి చెందినది గుర్తించారు.ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బును ఎరవేస్తున్న అభ్యర్థులు…కోట్లాది రూపాయలు తరలిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

అటు హైదారాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో 23 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ మొత్తమంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులదిగా అనుమానిస్తున్నారు.ఎవరు పంపించారు..ఎక్కడికి తరలిస్తున్నారు..అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలోనూ పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడింది.ఆదోని బీమాస్ సర్కిల్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఐదు లక్షల నగదును పట్టుకున్నారు.మనీకి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులోనూ డబ్బు కలకలం రేగింది.ఎన్‌.ఎస్‌ పేటలో భారీగా నగదు పట్టుకున్నారు.ఓ టీడీపీ కార్యకర్త ఇంట్లో సోదాలు నిర్వహించగా నగదు బయటపడింది.

అటు నెల్లూరు ఫతేఖాన్ పేట నారాయణ స్కూల్‌లోనూ నోట్ల కట్టల కలకలం రేగింది.ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులకు కాలేజీ బ్యాగ్‌లో నగదు తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు.అతడి వద్ద నుంచి పది లక్షల 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా పట్టుబడుతున్న మద్యం
తెలుగు రాష్ట్రాల్లో డబ్బుతో పాటు భారీగా మద్యం కూడా పట్టుబడుతోంది.నెల్లూరు జిల్లాలో సోమవారం వెయ్యికి పైగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గడిచిన వారం రోజుల్లో పోలీసులు లక్షల విలువచేసే మద్యాన్ని పట్టుకున్నారు.

మరోవైపు పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు.తనిఖీల్లో భారీగా నగదుతో పాటు మద్యం పట్టుబడుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *