విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం

విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం

విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై యంత్రాంగం సీరియస్ గా ఉంది. ఈ రాకెట్ లో తీగను లాగితే డొంక కదులుతుందని భావిస్తున్నాయి. అందుకే జిల్లా కలెక్టర్ కిడ్నీ మాఫియా పై త్రిసభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ అసలు కధను బయటపెట్టాలని ఆదేశించారు. వైద్యం ముసుగులో కిడ్నీ మాఫియాకు పాల్పడుతున్న ముఠా

కాసులకు కక్కుర్తి పడి వైద్య వృత్తికి కళంకితం తెస్తున్నారు కొందరు డాక్టర్లు. అమాయక ప్రజలను ఆసరా చేసుకొని, డబ్బు ఆశ చూపి అవయవాలను తోడేస్తున్నారు. విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పులతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని ఈ మాఫియా గ్యాంగ్ వలేసింది. కిడ్నీ ఆపరేషన్‌ చేసిన శ్రధ్ధ ఆసుపత్రి యాజమాన్యంపై అధికారులు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఒప్పందం ప్రకారం డబ్బు మొత్తం చెల్లించకపోవడంతో ఈ ముఠా బాగోతం వెలుగు చూసింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అక్కడి వైద్యుడి బాగోతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ త్రిసభ్య కమిటీని వేశారు. అటు రాష్ట్ర పోలీసు బాస్ కూడా ఈ ఘటనపై సీరియర్ అయ్యారు. దోషులు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన పార్థసారధి తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ప్రభాకర్‌ పరిచయమయ్యాడు. కిడ్నీ అమ్మితే 12లక్షలు ఇస్తారని ప్రభాకర్ చెప్పాడు. ఇంకేముంది కిడ్నీ అమ్మితే కష్టాలు తీరుతాయని భావించిన పార్థసారథి అందుకు ఓకే చెప్పాడు. ఇందుకు మంజునాధ్‌ అనే ఆయుర్వేద వైద్యుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. విశాఖలోని శ్రద్ధ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ బీఎస్ ప్రభాకర్‌ను సంప్రదించి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. అడ్వాన్సుగా పార్థసారధికి 5 లక్షలు ఇచ్చారు. మిగతా 7లక్షలు తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ.. మిగతా మొత్తం ఇవ్వకపోవడంతో బాధితుడు మహారాణిపేట పోలీసులను ఆశ్రయించాడు. ప్రభాకర్‌ తనను మోసం చేశాడని.. ప్రభాకర్ సోదరుడు వెంకటేష్‌ తన ఆధార్‌ కార్డును మార్ఫింగ్‌ చేసినట్టు వివరాలు ఇచ్చారు. శ్రద్ధ ఆస్పత్రి డాక్టర్‌తో పాటు ఆయుర్వేద వైద్యుడు మంజునాథ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

శ్రద్ధ ఆసుపత్రిని గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అయితే అప్పటి నిర్వాహకులు ఇప్పుడు అందుబాట్లో లేకపోవడం చర్చనీయాంశమైంది. కిడ్నీ మార్పిడి మాఫియా ఇలాంటి ఆసుపత్రిలో జరగడం సంచలనంగా మారింది. కలెక్టరేట్‌ సమీపంలోనే ఉన్న శ్రద్ధ ఆస్పత్రి దాదాపు మూతపడింది. ఒక రిసెప్షనిస్టు, ఇద్దరు ముగ్గురు సెక్యురిటీ గార్డులు తప్ప.. ఇంకెవరూ ఆసుపత్రిలో లేరు. నెఫ్రాలజీ సహా అన్ని వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రి మేనేజర్‌ వర్మ సహా నిర్వాహకులందరి ఫోన్లు స్విచాఫ్‌ అయ్యాయి.

ఇక పోలీసులు చెప్పే కథ మరోలా ఉంది. బాధితుడు ఫిర్యాదు చేస్తే తప్ప.. ఈ మొత్తం తతంగం బయటపడలేదు. కానీ, డాక్టర్‌ ప్రభాకర్‌ను అరెస్టు చేశామని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని, ఆస్పత్రి నిర్వాహకులపైనా చర్యలు తప్పవని.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. పోలీసులు పాత పాటే పాడుతున్నారు. కిడ్నీ మార్పిడి మొత్తం 23 లక్షల రూపాయలకు బేరం జరిగింది. ఆస్పత్రి యాజమాన్యంకు 12 లక్షలు రుపాయలు, డాక్టర్ ప్రభాకర్ కు 11లక్షలు . ఇక ఇలాంటివే ఇప్పటి వరకు 12 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు శ్రద్ధ హస్పటల్ చేసిందని పోలీసులే చెబుతున్నారు. అవన్నీ చట్ట ప్రకారం జరిగినవా లేదా అనేది తేలాల్సి ఉంది. త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.

కిడ్నీ మాఫియాలో ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితుడికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *