ఫిల్మ్‌నగర్‌లో డ్రగ్స్ కలకలం..!

ఫిల్మ్‌నగర్‌లో డ్రగ్స్ కలకలం..!

ఈ నగరానికి ఏమైంది….మత్తులో గమ్మత్తుగా చిత్తు అవుతున్నారెందుకు… విచ్చలవిడిగా డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి సామాన్యుల నుంచి టాలీవుడ్‌ స్టార్స్‌ వరకు మత్తులో జోగుతుంటే ఆ డ్రగ్స్‌ అక్రమంగా రవణా చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.. గతంలో డ్రగ్స్‌ట్రాఫికింగ్‌ లో సంబందం ఉందంటూ టాలివుడ్‌ స్టార్స్‌ పై నమోదైన కేసులు మరవక ముందే.. మరో భారీ డ్రగ్స్‌ ముఠా బాగోతం బయటపడింది..

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని దుర్గాభవానీ నగర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫిలింనగర్‌ బస్తీలలో డ్రగ్స్‌ విక్రయ కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వైజాగ్‌కు చెందిన కడాలి భాస్కర్‌ హ్యాష్‌ ఆయిల్‌ను, మత్తునిచ్చే టాబ్లెట్లు అమ్మతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దుర్గాభవానీ నగర్‌లో నిఘా పెట్టారు.. అదే సమయంలో గంజాయి మత్తు పదార్థాన్ని కొనేందుకు ముగ్గురు యువకులు రాగా పోలీసులు డ్రగ్స్‌ అమ్ముతున్న భాస్కర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరోవైపు గంజాయిని ద్రవరూపంలోకి మార్చి హ్యాష్‌ ఆయిల్‌ పేరుతో అమ్ముతున్నాడు . భాస్కర్‌ గత కొంత కాలంగా వైజాగ్‌ నుంచి సీసాల రూపంలో తీసుకొచ్చి ఒక్కో సీసాను ’ 2 వేలకు అమ్ముతున్నాడు. ద్రవరూపంలో ఉన్న గంజాయిని సిగరెట్‌లోకి కూర్చి పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాల్, అభిలాష్‌అనే మరో ఇద్దరు మత్తు ట్యాబ్లెట్లు అమ్ముతూ పట్టుబడ్డారు. భాస్కర్‌ నుంచి అయిదు హ్యాష్‌ ఆయిల్‌ సీసాలను, విశాల్‌ నుంచి పది వరకు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైపు తెలుగు సినీఇండస్ట్రీలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ స్పష్టంచేసింది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరినీ వదలిపెట్టమని..పుకార్లను నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 7 చార్జ్‌షీట్లు దాఖలు చేశామని.. మరో ఐదు దాఖలు చేయాల్సి ఉందని తెలిపారు. సినీతారల వ్యవహారంలో ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చాయన్న అధికారులు..మిగతా చార్జిషీట్లను దాఖలు చేస్తామని స్పష్టంచేశామని అధికారులు తెలిపి రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. ప్రభుత్వ అధికారుల్లో ఈ నిర్లక్ష్యం ఉన్నంత వరకు హైదరాబాద్‌ కూడా డ్రగ్స్‌ అడ్డాగా మారినా ఆశ్చర్యపడనవసరం లేదు…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *