ఏపీ అభివృద్ధికి సహకారం..మోదీ హామీ

ఏపీ అభివృద్ధికి సహకారం..మోదీ హామీ

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండవసారీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన మోడీ ‘ప్రజా ధన్యవాద సభ’లో పాల్గొన్నారు.

తిరుపతి సమీపంలోని రేణిగుంటలో జరిగిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీలో సీఎం జగన్ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అంతేకాదు.. జగన్ తన ఆకాంక్షలకు అనుగుణంగా, తన సంకల్పంతో మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.

ఇక ఏపీ అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్న ప్రధాని మోదీ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ అభివృద్ధికి కలిసి ముందుకు సాగుతాయన్నారు. పార్టీ గెలుపుఓటములను పక్కనపెట్టి ఏపీ, తమిళనాడు కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయడం ముదావహమని కొనియాడారు. ఇక ఏపీ ప్రజలు విజ్ఞానవంతులన్న మోదీ.. స్టార్టప్‌ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైనవారు రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ముందుకొచ్చారన్నారు.

అంతకుముందు తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ… గతంలో పలుసార్లు తిరుపతి వచ్చినా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకన్న ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. ఇక 130 కోట్ల మంది ప్రజల కలలు నెరవేరాలని శ్రీవారిని వేడుకున్నానని చెప్పారు. వెంకన్న సాక్షిగా మళ్లీ తమకు అధికారం అప్పగించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఆశావహులని భారత్‌ మాతా కీ జై అంటూ పార్టీని ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా పనిచేస్తున్నారని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *