ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన

ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన

ఐదేళ్ల క్రితం తొలిసారి ప్రధాని పగ్గాలు అందుకున్న నరేంద్రమోదీ వెంటనే భూటాన్‌ పర్యటనకు వెళ్లారు. ఇలా భూటాన్ ను సందర్శించడం ద్వారా ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీబంధానికి భారత్‌ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా చాటారు. తాజాగా రెండోసారి అధికారం చేపట్టిన ఆయన మాల్దీవుల ను తన తొలి విదేశీ పర్యటనగా ఎంచుకున్నారు. మాల్ధీవుల తర్వాత శ్రీలంక పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇలా ఇరుగు-పొరుగుకే ప్రాధాన్యం అన్న భారత్‌ వైఖరిని పునరుద్ఘాటిస్తున్నారు మోదీ. భూటాన్‌, మాల్దీవులు, శ్రీలంక… భౌగోళికంగా భారత్‌కు అత్యంత సమీప దేశాలు.ఈ దేశాలు సార్క్‌తోపాటు, బిమ్స్‌టెక్‌ లోనూ సభ్యత్వం కలిగి ఉన్నాయి. చైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు బీఆర్‌ఐ లోనూ మాల్దీవులు, శ్రీలంక భాగస్వామ్య దేశాలు.

గతంలో తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సార్క్‌ దేశాలను ఆహ్వానించిన మోదీ, ఈసారి బిమ్స్‌టెక్‌ దేశాలను ఆహ్వానించడంలో దీర్ఘకాలిక వ్యూహం దాగుంది. హిందూమహాసముద్ర తీరదేశాలైన మాల్దీవులు, శ్రీలంకలతో సత్సంబంధాలు నెరపడం ద్వారా ఈ ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు దీటైన సందేశం ఇవ్వడమే అసలు ఉద్దేశం. ఇప్పటికే ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో అయిదువేల కోట్ల రూపాయలతో భారత్‌ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. మోదీ తాజా పర్యటనకు సంబంధించి పెద్ద అజెండా అంటూ ఏమీ లేదు. ఆయా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే పర్యటన ప్రధాన ఉద్దేశం. కాగా మాల్దీవులకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇక మాల్ధీవుల విషయానికి వస్తే హిందూమహాసముద్రంలో భారత్‌, శ్రీలంకలకు వాయవ్య దిశలో సుమారు 298 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో, 26 దీవుల్లో విస్తరించిన చిన్న దేశమే మాల్దీవులు. నాలుగు లక్షలకు పైగా జనాభా గల ఈ దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. మాల్దీవులతో మొదటినుంచీ భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. 1988 నుంచి మాల్ధీవులతో మంచి సంబంధాలను భారత్ నడిపింది. అయితే 2013లో చైనా అనుకూలవాది అయిన అబ్దుల్‌ యమీన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత పరిస్థితి మారింది.

భారత్‌కే తొలి ప్రాధాన్యం అన్న విదేశాంగ విధానాన్ని ఆయన పూర్తిగా పక్కనపెట్టారు. భారతీయ కాంట్రాక్టులను రద్దు చేశారు. 2015 మార్చిలో మోదీ శ్రీలంక, మారిషస్‌, సీషెల్స్‌తో పాటు మాల్దీవుల్లోనూ పర్యటించాల్సి ఉంది. అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున పర్యటనను రద్దు చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో యమీన్‌ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. యమీన్‌ చైనా, సౌదీ అరేబియాలకు దగ్గరై, చిరకాల మిత్రదేశమైన భారత్‌ను చిన్నచూపు చూడటం ప్రారంభించారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేలా చైనాను ఆహ్వానించారు. చివరకు ఇది దేశాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. నిరుడు సెప్టెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా పాత్ర కీలకాంశంగా మారింది. చైనా పెట్టుబడులపై సమీక్షించనున్నట్లు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధినేత మహమ్మద్‌ ఇబ్రహీం సోలిహ్‌ ప్రకటించారు.

దీంతో అబ్దుల్లా యమీన్‌పై మహమ్మద్‌ ఇబ్రహీం సోలిహ్‌ ఘనవిజయం సాధించారు. నవంబరులో జరిగిన సోలిహ్‌ ప్రమాణస్వీకారానికి స్వయంగా మోదీ హాజరుకావడం ద్వారా ఇరుదేశాల మైత్రీబంధానికి మళ్ళీ అడుగులు పడ్డాయి. నిరుడు డిసెంబరులో సోలిహ్‌ భారత్‌ సందర్శించడంతో మైత్రీబంధం మరింత బలపడింది. 2002లో నాటి భారత ప్రధాని వాజ్‌పేయీ మాల్దీవులు సందర్శించారు. తరవాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం.

ఏదేమైనా ఇరుగుపొరుగు దేశాలతో మైత్రీబంధానికి భారత్‌ ప్రాధాన్యం అనే అంశాన్ని నిజం చేసేలా మోదీ మాల్ధీవుల్లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా మాల్ధీవులతో సామరస్యంగా ఉంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని హిందూ మహాసముద్ర ప్రాంతాలకు కూడా విస్తరించి, చైనాకు చెక్ పెట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది భారత్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *