తీవ్ర తుపానుగా మారిన ఫని

తీవ్ర తుపానుగా మారిన ఫని

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి అలలు ఏడు అడుగుల మేర ఎగసి పడుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ వేగాన్ని పుంజుకుంటున్న ఫణి తుపాన్.. అదే వేగంతో చెన్నై-మచిలీపట్నం వైపుగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో సముద్రం పది అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో తీర ప్రాంతాలన్నీ పోటెత్తిన సంద్రాన్ని తలపిస్తున్నాయి.

ఫణి తుఫాన్ తీరంవైపుగా దూసుకొస్తోంది. తీరంపై విరుచుకు పడేందుకు వాయు వేగంతో పరుగులు తీస్తోంది. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా.. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 990 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమమయ్యింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ.. తీరం సమీపంలోకి వచ్చిన తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు ఈ తుఫాన్ తీవ్రత మే 2 వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. ఏప్రిల్‌ 30న దిశను మార్చుకునే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. ఈశాన్య బంగాళాఖాతం వైపు మళ్లీ.. కోస్తాంధ్ర వెంట పయనించి బంగ్లాదేశ్‌ వైపు వెళ్లే అవకాశం ఉంటందంటున్నారు. తుఫాను ప్రభావంతో ఏప్రిల్ 30 తేదీల్లో కేరళలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, తమిళనాడు, కోస్తాంధ్రలో ఏప్రిల్‌ 30, మే 1న పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఫణి తుఫాన్‌కు తోడు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల మూడురోజులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఏపీ తీరంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. సముద్రం కల్లోల్లంగా ఉంటుందని.. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

ఇక తుఫాన్ హెచ్చరికలతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. కోస్తా తీరంలో వెంబడి ఉన్న జిల్లా కలెక్టర్లు.. మండలాలవారీగా సమీక్షలు నిర్వహించారు. ఎమ్మార్వోలతో పాటూ ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ.. తుఫాన్ ప్రభావాన్ని బట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో విద్యుత్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *