సలసల మరిగే నీళ్లు కూడా ఆవిరైపోయేంత చలి!

సలసల మరిగే నీళ్లు కూడా ఆవిరైపోయేంత చలి!
చలి ఎంత భయం పుట్టిస్తుందంటే…డిసెంబర్ నెల చివర్లో బైక్‌పై ఓ పది నిమిషాలు 40 స్పీడులో వెళ్తే వేళ్లు కొంకర్లు పోతాయి. అంత వణుకుపుట్టిస్తుంది చలి…అలాంటిది గత కొద్ది రోజులుగా అమెరికాలో చలి మైనస్ 50 డిగ్రీలు ఉందంటే అక్కడి వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు…అయితే, అమెరికాలో చలి కారణంగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఊరికే ఇంట్లో కూర్చుంటే మనుషులెందుకు అవుతారు. ఏదొక తింగరి పనిచేయాలి కదా..! పైగా ఇలా పనిపాట లేకుండా ఉండటం ఎప్పుడో గానీ దొరకదు.

ఏం చేయాలో తోచక!

పోలార్ వోర్టెక్స్ ప్రభావం కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాలను చలి పీక పిసికేస్తోంది. ఆఖరికి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నయగరా జలపాతం కూడా చలి గుప్పిట్లో బిగుసుకుపోయింది. నాయకులనే ఎన్నికల సమయంలో ముప్పుతిప్పలు పెట్టి వీధులెంట తిప్పే రకం జనాలు. ఇక చలి ఒక లెక్కనా వాళ్లకు…అమెరికాలో చలి వల్ల పని తక్కువైపోవడంతో…కొందరు సరదా సరదాగా వీడియో తీస్తూ కాలం గడిపేస్తున్నారు.

ఒక అమ్మాయి అప్పుడే వెచ్చగా స్నానం చేసి తడి జుట్టుతో గుమ్మ బయటకు వచ్చి నిలబడగానే ఆమె జుట్టు మంచు దెబ్బకు గట్టిగా అట్టకట్టుకుపోతుంది. ఇంకోక వ్యక్తి అయితే ఏకంగా వేడి నీళ్లు తెచ్చి వీధిలో గుమ్మరించగానే..సలసల మరిగే ఆ నీళ్లు మిల్లీ సెకన్ల వ్యవధిలో ఆవిరైపోయాయి. ఈ వీడియోలను చూసిన కొందరు షాక్ అయిపోతున్నారు. అలాంటి సరదా వీడియోలకు తోడు కొందరి కామెంట్లు కూడా భలే సరదాగా ఉంటున్నాయి. ఒక వ్యక్తి…’ చలి కారణంగా రాజకీయ నేతలు తమ జేబులోనే చేతులు పెట్టుకుని ఉండటం చూస్తున్నాం ‘ అని సెటైర్ వేయడం అందరికీ తెగ నవ్వు తెప్పించింది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *