పోలింగ్‌ ముగిసినా నోరు విప్పని పవన్‌

పోలింగ్‌ ముగిసినా నోరు విప్పని పవన్‌

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయంపై అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే అజ్ఞాతవాసి మాత్రం నోరు మెదపడం లేదు. కొన్ని చోట్ల జనసేన ఆఫీసులకు టు లెట్‌ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. అసలు జనసేనలో ఏం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని… తనకే అధికారం అని జగన్మోహన్ రెడ్డి… అంటున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. సైకిల్‌ జోరును ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో… సీఎం.. సీఎం అని పవన్ పిలిపించుకునేవారు. తాను పల్లకీ మోయడానికి రాలేదని.. స్పష్టం చేసేవారు. తానే ముఖ్యమంత్రిని అవుతాననేవారు. అలాంటిది.. పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ సైలెంటవడం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఎవరెన్ని ప్రకటనలు చేసినా ఈవీఎంలలోని ఫలితం మారదు..! ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు… తామంటే.. తాము గెలుస్తామని ప్రకటించుకోవడం ద్వారా.. అందులో ఉన్న ఫలితం మారే అవకాశం లేదు. అందుకే పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారేమో. అయితే టీడీపీ, వైసీపీల మధ్య పోరు కేంద్రీకృతం కావడంతో జనసేన ఇబ్బందులు పడినట్లే అనిపించింది. పవన్ కల్యాణ్… మొదట్లో ఉన్న ఊపు చూపలేకపోయారని.. బలమైన అభ్యర్థుల్ని పెట్టలేదని.. విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు – అభ్యర్థులతో పెద్దగా పనేం లేదు.. పవన్ కల్యాణ్‌ను చూసి ఓట్లేస్తారన్న ఉద్దేశంతో బలమైన అభ్యర్థుల్ని పెట్టాల్సిన పని లేదన్న వాదన జనసేన వర్గాల నుంచి వస్తుంది. అయితే.. దీన్ని ఇతర పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. టీడీపీతో రహస్య అవగాహనలో భాగంగానే.. ఇలా అభ్యర్థులను పెట్టలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు – అధికారం వస్తుందా.. రాదా అని.. టీడీపీ, వైసీపీలు కిందా మీదా పడుతున్నాయి. కానీ ఆ టెన్షన్ జనసేనకు లేదు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లభిస్తుందా..? అసెంబ్లీలోకి జనసేన ఎమ్మెల్యేలు అడుగుపెడతారా..?. హంగ్ ఏర్పడుతుందా..? హంగ్ ఏర్పడితే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా..? ఇలాంటి సందేహాలు జనసేన క్యాడర్‌లో ఉన్నాయి.

అటు పోలింగ్ తర్వాత జనసేన మరీ ఊసులో లేకుండా పోయింది. పోలింగ్ అనంతరం పవన్ కనీసం చిన్నపాటి ప్రెస్ మీట్ పెట్టలేదు. రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసి – తనే రెండు చోట్ల నామినేషన్ వేసి – తన పార్టీని పోటీ చేయించి – ప్రచారం చేసి.. తీరా పోలింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ మాట మాత్రమైన స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.మీడియా ముందుకు వచ్చేంత తీరిక లేకపోతే.. కనీసం ఏ ప్రెస్ నోటో విడుదల చేయొచ్చు. దానికీ తీరిక లేకపోతే ఫేస్ బుక్ లోనో – ట్విట్టర్ లోనో స్పందించవచ్చు.

అవతల ఈవీఎంల విషయంలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈవీఎంల మీద చంద్రబాబు నాయుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలిచేది తమ పార్టీనే అంటూ.. మరోవైపు ఈవీఎంల మీద బాబు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ అంశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తన స్పందన తను తెలియజేస్తూ ఉంది. పవన్ కల్యాణ్ మాత్రం స్పందించడం లేదు. ఈవీఎంల మీద అవగాహన లేదా ఇక రాజకీయాల మీదే ఆసక్తి లేదా? అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇక కొన్ని జిల్లాల్లో జనసేన ఆఫీసులకు టు లెట్‌ బోర్డులు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. పోల్‌ ఖతం..దుకాణ్ బందేనా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎన్నికలు అయ్యాక… కొన్ని రోజులు పార్టీ ఆఫీసులు బోసిపోయి ఉండటం సహజమే కానీ… టు లెట్‌ బోర్డులు పెట్టడం మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. పవన్‌ మళ్లీ సినిమాలపై దృష్టి పెడతారని విశ్వసనీయ సమాచారం. మరి అటు సినిమాలు… ఇటు రాజకీయాలు… రెండు రంగాల్లో రాణించడం సాధ్యమౌతుందా అన్నది వేచి చూడాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *