కేసీఆర్‌కి గిఫ్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ?

కేసీఆర్‌కి గిఫ్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గిఫ్ట్‌ల, రిటర్న్ గిఫ్ట్‌ల పర్వం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభల ఎన్నికలకూ, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకూ తేదీలు ప్రకటించగానే రాజకీయ పార్టీల నాయకులు గిఫ్ట్‌ల, రిటర్న్ గిఫ్ట్‌ల సంస్కృతిని మరింత పెంచుతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏ ముహూర్తాన ఆయన ఆ మాట అన్నారో కానీ… ఇక అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ జోరు ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిరోజూ గిఫ్ట్ల్, రిటర్న్ గిఫ్ట్‌ల గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు.

పవన్‌ కూడా తోడయ్యాడు…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్…. కెసిఆర్ చేస్తున్న పనుల కారణంగా గిఫ్ట్‌గా మారనున్నదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డాడు. ఈ ప్రకటనకు ముందు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కానీ తెలంగాణలో ఆంధ్రులు పడరాని పాట్లూ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఆంధ్రా సెటిలర్లు మండిపడుతున్నారు. చంద్రబాబుకు కెసిఆర్ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తెలంగాణలో ఉన్న సెటిలర్లు మరోసారి కెసిఆర్ వైపు మొగ్గు చూపేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోని సెటిలర్లు తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో సొంత ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నామని అంటున్నారు. ఎలాంటి సమస్యలూ లేని తెలంగాణలో పవన్ కల్యాణ్ చేసిన అనాలోచిత వ్యాఖ్యల కారణంగా భవిష్యత్తులో తాము ఇబ్బంది పడతామని సెటిలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనలు, భయాలు పోగొట్టుకునేందుకు వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి మరోసారి మద్దతు పలికే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రుల గిఫ్ట్ లు, రిటర్న్ గిఫ్ట్ ల సంగతి ఏమో గానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు తెలియకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు “సెటిలర్ల ఓట్లు” అనే అతిపెద్ద గిఫ్ట్ ను ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *