యథేచ్ఛగా పార్కింగ్ దందా

యథేచ్ఛగా పార్కింగ్ దందా

సినిమా చూడడానికి వెళ్ళినా… షాపింగ్‌కు వెళ్ళినా… కుటుంబ సమేతంగా భోజనాలకు వెళ్ళినా… పార్కులకు… మార్కెట్లకు… ఎక్కడికి వాహనంపై వెళ్ళిన మొదటగా చెల్లించాల్సింది పార్కింగ్ ఫీజులే. ఒక్కో చోట ఒక్కో రకం బాదుడు. ఈ పార్కింగ్ దందా అక్రమమని తెలిసినా నిర్వాహకులు యథేచ్ఛగా అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్నారు.

మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు . టూ వీలర్స్ రూ. 30(విత్ జీఎస్టీ), ఫోర్ వీలర్స్ రూ.60 ఇలా ఎంత పడితే చెల్లించాల్సిందే. ఎందుకు పార్కింగ్ ఫీజు కట్టాలంటూ అక్కడున్న వారిని నిలదీస్తే సమాధానం చెప్పేవారుండరు.. పార్కింగ్ నిర్వాహకులే వాహనదారులపై దాడి చేసే పరిస్థితులు ఉంటాయి. దీంతో చాలామంది ధైర్యం చేయడంలేదు… దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారంటూ పోలీసులకు చెబితే.. తమకు సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ చూసుకోవాలంటూ గతంలో పట్టించుకోలేదు.

ఇటీవల మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి.. పార్కింగ్ టిక్కెట్‌తో పాటు జీఎస్‌టీ అంటూ మరింత అదనంగా బాదుడు మొదలు పెట్టారు. అయితే మూడు కమిషనరేట్ల పరిధిలో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఇప్పుడు వీటిపై కూడా దృష్టి పెట్టారు. బాధితులు ధైర్యంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు చేస్తున్నారు. కమర్షియల్ భవనాలు (షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, ఇతర వాణిజ్య సముదాయాలు) తప్పని సరిగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి, వీటితో పాటు రెసిడెన్షియల్ అపార్టుమెంట్లలోను పార్కింగ్ స్థలాలను విక్రయించడం, లీజుకు ఇవ్వడం కూడా మున్సిపల్ నిబంధనలకు విరుద్దమే. ఈ స్థలాలను లీజులకు గానీ, పెయిడ్ పార్కింగ్‌లుగా కానీ వినియోగించరాదు. అక్కడికి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఉచితంగా అందుబాటులో ఉంచాలి. కానీ ఇందుకు విరుద్ధంగా నగరంలోని చాల కమర్షియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ వసూళ్ళు చేస్తున్నారు. అయితే అపార్టుమెంట్లలో పార్కింగ్ ఫీజు వసూళ్లు అక్రమమని, ఈ విషయాన్ని న్యాయస్థానాలు కూడా తీర్పు చెప్పాయని, అయినా చాలామంది భవన యజమానులు, ఆయా కాంప్లెక్స్ నిర్వాహకుల వైఖరి మారడం లేదని యథేచ్ఛగా పార్కింగ్ పీజులను వసూలు చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ యాక్టు 1955 సెక్షన్ 115(4) ప్రకారం ఆయా భవనాలకు వచ్చే వారికి అనువైన పార్కింగ్ స్థలం చూపించాలని, దానిని పబ్లిక్ ప్లేస్‌గా చూపించాలనే నిబంధన ఉంది. 2012లో ప్రభుత్వం తెచ్చిన జీవో 168లోని బిల్డింగ్ నిబంధనల ప్రకారం 44 శాతం కామన్ ఏరియాగా వదిలేయాల్సి ఉంటుంది. ఏపీ/టీఎస్ అపార్టుమెంట్ చట్టం 1987 ప్రకారం ఆయా భవనాలలోని ఈ కామన్ ఏరియాను అమ్మడం, లీజుకివ్వడం, దుర్వినియోగం చేయడం నిషేధం. ఇలాంటి విషయాలలో ప్రభుత్వం తగు రాయితీని సైతం అందిస్తుంది. నిబంధనల ప్రకారం అవసరాల కోసం వదిలేసే ఖాళీ స్థలంలో బిల్డర్‌లు ఎలాంటి ప్రయోజనాలను పొందకూడదని నిబంధనలు సూచిస్తున్నాయి. కానీ భవన యాజమాన్యాలు తమ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని ఖాళీ ప్రాంతాలలో ఏర్పాటు చేసే పార్కింగ్‌లతో పాటు ఇతర చిన్న చిన్న వ్యాపార సముదాయాలకు లీజులకు ఇస్తూ లక్షల డబ్బులు సంపాదిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని తమ స్వప్రయోజనాలకు ఉపయోగిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అక్రమ పార్కింగ్ వ్యవహారాలపై హైకోర్టు సైతం గతంలో సీరియస్ అయ్యింది. ఇలాంటి వాటిపై ఇకనైనా జీహెచ్‌ఎంసీ తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

గ్రేటర్‌లో పార్కింగ్‌ మాఫియా దోపిడీ కోట్ల రూపాయల్లో ఉంటుంది. కొన్నాళ్ల నుంచి రోడ్ల పక్కన జీహెచ్‌ఎంసీ ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పించినా.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, వాణిజ్య భవనాల్లో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ వసూలు చేస్తున్నారు. గంటల లెక్కన రేటు కట్టి మరీ దండుకుంటున్నారు. నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పార్కింగ్‌ రుసుము ఉండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ద్విచక్రవాహనానికి కనీస పార్కింగ్‌ రుసుము రూ.10 ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో రూ.20 వసూలు చేస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరధిలోని పార్కింగ్‌ యార్డుల్లో మాత్రం గంటల లెక్కన వసూలు చేస్తున్నారు. వసూలుకు సంబంధించి రశీదులు కూడా సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఇదేంటని అడిగితే దాడి చేసేందుకూ నిర్వాహకులు వెనకాడరు.

మాల్‌లో షాపింగ్‌ చేస్తే.. పార్కింగ్‌ రుసుమును బిల్లు నుంచి మినహాయిస్తుండగా… అదే కాంప్లెక్స్‌లో సినిమా చూస్తే మాత్రం టికెట్‌ డబ్బుల నుంచి మినహాయింపు ఉండదు. నలుగురు సభ్యులతో కూడిన ఒక కుటుంబం సినిమాకు వెళితే.. టికెట్‌ ధరకు సమానంగా ఇతర ఖర్చులు ఉంటున్నాయి. తినుబండారాలు, పార్కింగ్‌ రుసుము, టికెట్‌ ధరతో కలిపి కనీసం రూ.1000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా నగరంలో ఈ దోపిడీ సాగుతూనే ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *