మహాకూటమిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకంపనలు

మహాకూటమిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకంపనలు

దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్‌ పోల్స్ సర్వే ఫలితాలు విపక్ష నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కార్‌ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఇది మహాకూటమిని కొంత కుదుపునకు గురిచేసినట్టుగా తెలుస్తోంది. కలిసొచ్చే పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే-ఈలోగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌ రిజల్ట్స్ బీజేపీకి స్వీట్ తినిపించగా, కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేసింది. సోనియాగాంధీ, రాహుల్‌తో మాయావతి సమావేశం రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. మాయావతికి ఢిల్లీలో ఎలాంటి కార్యక్రమాలు, సమావేశాలు లేవని…లక్నోలోనే ఉంటున్నారని బీఎస్పీ నేత ఒకరు చెప్పుకొచ్చారు.

మోదీని గద్దెదించేందుకు కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ కూటమికి బీఎస్పీ దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీని ప్రతిపక్షాల కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యవర్తి పాత్ర పోషించారు. దీనిపై అటు రాహుల్‌, ఇటు మాయావతితో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి మాయావతి, రాహుల్‌ సోమవారం భేటీ కానున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని బీఎస్పీ స్పష్టతనిచ్చింది. మాయావతి మహాకూటమిలో ఉన్నప్పటికీ, ఆమె ఎన్డీయే వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఎన్నికలయిపోయిన దగ్గర్నుంచి మహాకూటమికి మద్దతు కూడ గట్టే పనిపైనే చంద్రబాబు బీజీగా ఉన్నారు. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, విపక్ష నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆఖరి దశ పోలింగ్ రోజైన 19న యూపీయే అధ్యక్షురాలు సోనియాగాంధీతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి 10-జన్‌పథ్‌కు వెళ్లిన ఆయన సుమారు 40 నిమిషాలపాటు సోనియాతో జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు సోనియాకు త్రిముఖ వ్యూహం గురించి వివరించారట. ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కటిగా ఉన్నాయన్న సందేశాన్ని బలంగా వినిపించడం. విపక్షాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్య వస్తే, తామంతా ఒక్కటేనని రాష్ట్రపతికి లేఖ ఇవ్వడం. తటస్థ పార్టీలని మహాకూటమిలోకి రప్పించడం. అయితే- అసలు ఫలితాలు వచ్చాక, ఈ వ్యూహాన్ని అమలు చేయాలని వారు భావించారట. అంతకుముందు చంద్రబాబు రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌లతోనూ సమావేశమయ్యారు. ఎస్పీ, బీఎస్పీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతిలతో జరిపిన చర్చల సారాంశాన్ని వెల్లడించారు.

అయితే – ఎగ్జిట్‌పోల్స్‌ ప్రస్తుతం ఎన్డీయేకి అనుకూలంగా వచ్చినంత మాత్రాన బెంబేలెత్తాల్సిన అవసరంలేదంటూనే, ఫలితాల విషయంలో కూటమి నేతలు కంగారుపడుతున్నారట. ఏది ఏమైనప్పటికీ అసలు సిసలు ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో, హస్తినలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *