మిగిలింది 48 గంటలే!

మిగిలింది 48 గంటలే!

ఎన్నికల ఘట్టం ఆఖరి అంకానికి చేరుకుంది.ప్రచారానికి రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది.మరో 48 గంటల్లో మైకులు మూగబోనున్నాయి.పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ రోజులు చాలా కీలకం.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో మరింత వేగం పెంచాయి.ఒక్క క్షణం వేస్ట్‌ చేయకుండా..ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.వరుస సభలు,రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు.ఆఖరి రెండ్రోజుల్లో వీలైనన్ని సభలు పెట్టాలని అటు అభ్యర్థులు..ఇటు ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు,ప్రతిపక్ష నేతలు కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.అన్ని పార్టీల అధినేతలు,ప్రతిపక్ష నాయకులు సభలు,ర్యాలీలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరంటూ దూసుకుపోతున్నారు.

ఇప్పటివరకు తమతో ఉన్న వారిని పోలింగ్‌ వరకు కాపాడుకుంటూనే ప్రత్యర్థి వర్గాలను ఆకర్షించడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు.ఎన్నికల ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది ఎన్నికల కమిషన్‌.చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ఒక్క నిమిషం కూడా వేస్ట్‌ చేయకుండా వరుస సభలు,రోడ్‌ షోలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌,జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సహా బీజేపీ నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మరింత దూకుడు పెంచారు.విపక్ష పార్టీల టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు.మోదీ, కేసీఆర్‌తో కలిసి జగన్ ఏపీపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.కుట్ర రాజకీయాలు చేస్తున్న ఆ  ముగ్గుర్ని ఓడించాలని పిలుపునిచ్చారు.అదేసమయంలో మాతో పెట్టుకుంటే హైదరాబాద్ బ్రాండ్‌ ఉండదన్నారు.తనతో పెట్టుకుంటే హైదరాబాద్‌లో ఉండలేక పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనన్న విషయాన్ని మరవద్దని గుర్తు చేశారు చంద్రబాబు.

పేదల కోసం టీడీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.దేశంలో 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు.మంగళగిరిలో పర్యటించిన బ్రాహ్మిణి రోడ్ షోలో పాల్గొన్నారు.పసుపు-కుంకుమ పథకం కింద మహిళలు ఆర్థికంగా ఎదిగారని చెప్పారు.ఇదిలా ఉంటే..చంద్రబాబుపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు,లోకేష్‌ ఇద్దరూ కలిసి ఏపీని లూటీ చేశారని విమర్శించారు. అమలాపురం రోడ్ షోలో పాల్గొన్న షర్మిల…మీ భవిష్యత్  నా బాధ్యత అంటున్న చంద్రబాబు గత ఐదేళ్లుగా లోకేష్‌ భవిష్యత్ గురించే ఆలోచించారని ఆరోపించారు.ఇలా ఎన్నికల ప్రచారంలో నేతలు మాటల తూటాలు పేలుతున్నాయి.అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.మరో రెండ్రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎలక్షన్‌ క్యాంపెయిన్‌లో హీట్‌ పుట్టిస్తున్నారు.ఇప్పటివరకు గెలుస్తామన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు ఆఖరి నిమిషంలో టెన్షన్‌ పడుతున్నారు.గతంలో చాలాసార్లు చివరిఘట్టంలో జాతకాలు తారుమారు అయ్యాయని గుర్తు చేసుకుంటున్నారు.ఓటర్లు ఎక్కడ మనసు మార్చుకుంటారోనన్న భయంతో ఊర్లకు ఊర్లు చుట్టేస్తున్నారు.అంతేకాదు ఈ రెండ్రోజుల్లో అధినేతలను రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అధినేతలు రాకుంటే..స్టార్‌ క్యాంపేయినర్లతోనైనా ప్రచారం చేయించాలని భావిస్తున్నారు.

ఇదిలాఉంటే..నగదు,మద్యం కూడా పీక్‌ స్టేజీకి చేరుకుంది.ప్రచారం ముగింపు గడువు దగ్గర పడుతున్నా కొద్దీ..నోట్ల కట్టలు పెద్దమొత్తంలో బయటకు వస్తున్నాయి.లిక్కర్‌ బాటిళ్లు కేసులకు కేసులు దొరికిపోతున్నాయి.చెక్‌పోస్టుల్లో ఏ వాహనం ఆపినా మందు,నగదు ఇలా ఏదో ఒకటి పట్టుబడుతోంది.దీంతో అధికారులు కూడా తనిఖీలు ముమ్మరం చేశారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *