తెలుగు రాష్ట్రాల్లో కానరాని చినుకుజాడ

తెలుగు రాష్ట్రాల్లో కానరాని చినుకుజాడ

వానాకాలం మొదలై నెల రోజులవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో చినుకు జాడ లేదు. తొలకరి చినుకులు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. చినుకమ్మా.. కరుణించు అంటూ రైతన్నవేడుకుంటున్నాడు. జూన్‌‌ మొదటివారంలో తెలుగు రాష్ట్రాలను పలకరించాల్సిన నైరుతి రుతు పవనాలు.. జులై వచ్చినప్పటికీ.. కనికరించకపోవటంతో సాగునీటికే కాదు.. త్రాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదువుతున్నాయి.

చెరువుల్లో చుక్క నీరులేదు… బోర్లు బావురమంటున్నాయి. ఏరుకాకు ముందే దుక్కిదున్నిన రైతన్న గడ్డివానల్లేక దిగులు పడుతున్నాడు. కోటి ఆశలతో విత్తనాలు వేసిన కర్షకుడు గుండెపగులుతోంది. ప్రతీ ఏడాది జూన్ పదో తేదీలోగా రైతన్నన్న వెన్నుతట్టి లేపాల్సిన వరుణుడు ఈ ఏడాది మాత్రం చిరుకన్ను వేశాడు. నాలుగు నెలల వర్షాకాలంలో జూన్ మొత్తం ఇలా చినుకు జాడలేకుండానే పోయింది. దీంతో రైతుల ముఖాలు చిన్న బోయాయి.

ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే వారం ఆలస్యంగా కేరళను తాకాయి. ఆ తరువాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను.. రుతుపవనాల విస్తరణకు అడ్డంకిగా మారడంతో… అటు అరేబియా సముద్రం, ఇటు భూ ఉపరితలంపై తేమను తీసుకుపోయింది. దీంతో రుతుపవనాలు పుంజుకున్నప్పటికీ.. ఆశించిన వర్షాన్ని ఇవ్వలేదు. దక్షిణాది మొత్తానికి రుతుపవనాలు విస్తరించాయని చెప్పడమే తప్ప చినుకు కురిసిన దాఖలాలు లేవు. దీంతో దేశవ్యాప్తంగా పలు నగరాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోంటున్నాయి.

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశముందని అంటున్నారు. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు విస్తారంగా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారాలు తెలిపారు.

ఇప్పటికైన వరుణుడు కరుణించి.. వర్షాలు పలకరించాలని… కర్షకుడు పులకరించాలని ఆశిద్ధాం. దేశ ఎదుర్కోంటున్న తాగునీటి, సాగు నీటి సంక్షోభాన్ని చెక్కుపెట్టాలిని కోరుకుందాం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *