మోదీ రెండో క్యాబినెట్‌లో నిర్మలా సీతారామన్‌కు చోటు

మోదీ రెండో క్యాబినెట్‌లో నిర్మలా సీతారామన్‌కు చోటు

నిర్మలా సీతరామన్.. జాతీయ రాజకీయాల్లో ఈమె పేరు మారుమోగుతోంది. డిఫెన్స్ మినిస్టర్‌గా సత్తాచాటిన ఈ తెలుగింటి కోడలు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా రికార్డ్ సృష్టించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిలిచారు.కేంద్ర మంత్రి మండలిలో ఆర్థిక శాఖ ఎంతో కీలకమైనది. ఇప్పుడీ అవకాశం కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా పేరుకెక్కిన ఈమె ఇప్పుడు ఈ అరుదైన ఘనత సాధించారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో.. అనుహ్యాంగా నిర్మలా సీతారామన్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో దేశ ఆర్థిక మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిర్మల చరిత్ర సృష్టించారు.

మరోవైపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1970-71లో ఆర్థిక శాఖను ఆమె వద్దే అంటిపెట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖను నిర్వహించిన రెండో మహిళగా నిర్మల నిలిచారు. దేశ తొలి మహిళా రక్షణ శాఖమంత్రిగా కూడా నిర్మల రికార్డు నెలకొల్పారు.

తమిళనాడులోని మదురైలో 1959 ఆగస్ట్ 18న జన్మించిన నిర్మలా సీతారామన్ కీలకమైన మంత్రిత్వ శాఖలను అధిరోహించే స్థాయికి ఎదిగారు. తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న సీతాలక్ష్మీ రామస్వామి కాలేజ్‌లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. నిర్మలా సీతారామన్ గతంలోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. వాణిజ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

మొత్తానికి రక్షణమంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన నిర్మలా సీతారామన్..ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా నియామకంపై తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *