కివీస్ పేస్...బ్లూమెన్ స్మాష్

కివీస్ పేస్...బ్లూమెన్ స్మాష్
మన భారత క్రికెట్ ఆటగాళ్లకు అతి పొగడ్త చాలా చేటు చేస్తుంది. దీనికి సరైన ఉదాహరణ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డే. మొదటి మూడు వన్డేల్లో భీకరంగా ఆడి అలవోకగా సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత జట్టు…నాలుగో వన్డే రాగానే అలసత్వం వచ్చేసింది. మొదటి వన్డే నుంచి వన్‌సైడ్ గేమ్‌లా సాగినా నాలుగో వన్డేలో కివీస్ పేసర్ల దెబ్బకు చిత్తుగా పడిపోయింది. భారత జట్టు వన్డే చరిత్రలోనే మరీ దారుణంగా అత్యల్ప స్కోరుకె ఆలౌట్ రికార్డుని మూటగట్టుకుంది.

బోల్ట్ బంతి దూకుడు

మొదట న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటింగ్‌కు దిగింది. తొలుత ఓపెనర్లు నిలకడగానే మ్యాచ్‌ని ఆరంభించారు. వికెట్‌ని కాపాడుకుంటూ పరుగులు చేశారు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ పెవిలియన్ చేరిన దగ్గరి నుంచి వరుసగా వికెట్లను పోగొట్టుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వెనుదిరిగారు. ధావన్ వెళ్లిన కొంత సమయానికే రోహిత్ శర్మ బోల్ట్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ పరుగులేమీ చేయకుండా నిరాశ పరిచారు. వీరిద్దరి తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ కేవలం ఒక్క పరుగుతో సరిపెట్టుకుని వెళ్లిపోయాడు. ఇక చివర్లో హార్థిక్ పాండ్యా(16), కుల్దీప్ యాదవ్(15), యజువేంద్రా చాహల్(18) కాసేపు పరుగులను జోడించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో భారత జట్టు 92 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్ బోల్ట్ 5 వికెట్లతో విఝృంభించి భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.

అతి తక్కువ టార్గెట్‌ని ఛెధించడానికి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆటగాళ్లలో రాస్ టేలర్ 25 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నికోలస్ 42 బంతుల్లో 30 పరుగులతో రాణించడంతో 14.4 ఓవర్లలో 93 లక్ష్యాన్ని అలవోకగా పూర్తీ చేసి విజయాన్ని దక్కించుకుంది. గత మూడు వన్డేల్లో ఓటమి పాలైన న్యూజిలాండ్ జట్టు ఈ వన్డే గెలుపుతో కాస్త ఊరట లభించింది. ఇక ఆఖరి వన్డే ఆదివారం వెల్లింగ్టన్ మైదానంలో జరగనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *