కొత్త ఓటర్లు ఎవరి వైపు తిరుమలేశా... !?

కొత్త ఓటర్లు ఎవరి వైపు తిరుమలేశా... !?

కొత్త ఓటర్లు. 18 సంవత్సరాల వయసు దాటి… ఏది మంచి.. ఏది చెడు తెలుసుకున్న ఓటర్లు. తమ భవిష్యత్ కు దిశానిర్దేశం చేసే పార్టీలు ఏవో అంచనా వేసుకుని తొలిసారిగా తమ ఓటు ఆయుధాన్ని ఉపయోగించిన యువతరం. తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి కొత్త… యువ ఓటర్లే ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకంగా మారారు.

ఎన్నికల సంఘం చేసిన ప్రచార ప్రభావమో…. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు దగ్గరుండి ఓటర్లుగా నమోదు చేయించిన వైనమో….. తమకు తామే ఓటర్లుగా నమోదు చేసుకోవాలనే ఉత్సాహమో… ఏదైతేనేం… తెలుగు రాష్ట్రాల్లో యువ ఓటర్లు… కొత్తగా నమోదు చేయించుకున్న ఓటర్లు భారీ స్ధాయిలోనే ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐదు నుంచి పది శాతం వరకూ కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్న వారు ఉన్నారని ఓ అంచనా. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే, ఈ కొత్త… నవతరం ఓటర్లు ఎవరి పక్షం వహించారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓటును తమ ఆయుధంగా భావించిన యువతరం ఓటర్లు ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించారనేదే మిలియన్ డాలర్ల పశ్నగా మిగిలింది. వీరి ఓట్లే ఈ ఎన్నికల్లో కీలకమని, గెలుపోటములను నిర్ణయించేది ఈ యువ ఓటర్లేనని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అంటే యువ ఓటర్లు తమ ఓటు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ మేనియాకు వేసారా…? లేకపోతే యువ నాయకుడిగా…. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చారని చెబుతున్న రాహుల్ గాంధీకి వేసారా.. ?, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని కేంద్రంలో కూడా చూడాలనే ఆకాంక్షతో ఆ పార్టీకి వేసారా…? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణలో యువ ఓటర్లు తమ ఓటు ఆయుధాన్ని ఏ పార్టీకి అనుకూలంగా వేసారోనని ఆయా పార్టీలకు చెందిన అభ్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అటు శాసనసభకు, ఇటు లోక్ సభకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా కొత్తగా ఓటర్లుగా మారిన యువత ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత అన్నివిధాలుగా నష్టపోయామనే భావన యువతరంలో నెలకొంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపం భారతీయ జనతా పార్టీపైనా…. అన్యాయంగా విడదీసారనే ఆగ్రహం కాంగ్రెస్ పార్టీపైనా యువకుల్లో నెలకొంది. దీంతో జాతీయ పార్టీలైన ఈ రెంటిని ఆంధ్రప్రదేశ్ యువతరం దూరం పెట్టిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక మిగిలిన తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, జనసేన పార్టీలలో యువతరం ఎవరి వైపు మొగ్గు చూపారనేదే ప్రధాన చర్చగా మారింది. యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చాం కాబట్టి తమనే కొత్త ఓటర్లు ఎన్నుకుంటారని తెలుగుదేశం నమ్మకంగా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు యువకులకు… ముఖ్యంగా నిరుద్యోగులకు ఏమీ చేయలేదనే కోపం వారిలో ఎక్కువగా ఉందని, అందుకని వారి ఓట్లు మాకే పడ్డాయని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆశగా ఉంది. అయితే తాను చెప్పే సిద్ధాంతాలు, ప్రసంగాలతో పాటు సినీ గ్లామర్ కూడా పని చేసి యువతరం తనకే ఓట్లు వేశారని పవన్ కల్యాణ్ పార్టీ జనసేన భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఓటర్లు ఈ మూడు పార్టీలలో ఎవరిని కరుణించారో మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇది తేలాలంటే మరో నెల రోజుల పాటు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్ధులు ఈవీఎంల వైపు ఆశగా చూడాల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *